లాఠీచార్జిలో బీజేపీ ఉపాధ్యక్షుడికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

లాఠీచార్జిలో బీజేపీ ఉపాధ్యక్షుడికి తీవ్రగాయాలు

Published Thu, Feb 2 2017 8:56 AM

లాఠీచార్జిలో బీజేపీ ఉపాధ్యక్షుడికి తీవ్రగాయాలు - Sakshi

కేరళలోని ఒక న్యాయ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ వావా కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వావాకు టియర్ గ్యాస్ షెల్ తలమీద తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 
 
కేరళ న్యాయ అకాడమీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ప్రైవేటు కళాశాల. ఇక్కడ ప్రిన్సిపాల్ లక్ష్మీ నాయర్‌ను తొలగించడంతో విద్యార్థులు గత మూడు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఇదే అంశంపై మంగళవారం నాడు బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించగా, పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. పోలీసు దాష్టీకానికి నిరసనగా తిరువనంతపురంలో బీజేపీ బుధవారం నాడు హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వి.మురళీధరన్ న్యాయకళాశాల ఎదురుగా నిరాహార దీక్ష ప్రారంభించగా, ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన స్థానంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి రాజేష్ గురువారం నుంచి దీక్ష ప్రారంభిస్తారు. తాను కూడా విద్యార్థులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కె.మురళీధరన్ ప్రకటించారు.

Advertisement
Advertisement