
బీజేపీకి కార్పొరేట్‌పైనే ప్రేమ: రాహుల్
బీజేపీకి కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడంలో ఉన్న ఆసక్తి పేద ప్రజలపై ఉండదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
చిత్తోర్‌గఢ్/బికనీర్: బీజేపీకి కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడంలో ఉన్న ఆసక్తి పేద ప్రజలపై ఉండదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కొంతమంది కోసమే ప్రభుత్వం ఉందని వారు నమ్ముతారన్నారు. రాజస్థాన్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మంగళవారం జరిగిన సభల్లో పాల్గొన్న ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శించారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య పూర్తి స్థాయిలో వైరుధ్యం ఉందన్నారు.
ఈ దేశం పేదలు, సంపన్నులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పనివారు లాంటి అందరిదీ అని కాంగ్రెస్ భావిస్తుందని, బీజేపీకి మాత్రం కొద్ది మందిపైనే ధ్యాస ఉంటుందని చెప్పారు. బీజేపీ నాయకుల ప్రసంగాలు వింటే అది అర్థమవుతుందని, వాళ్లెపుడు ఎయిర్‌పోర్టులు, మౌలికసదుపాయాలు, రోడ్ల గురించే మాట్లాడతారే తప్ప పేద ప్రజల గురించి కాదని వివరించారు. తాము కూడా వాటిని నిర్మించాలనే చెబుతామని అయితే అదే సమయంలో పేదలకు సాయం చేయాలని యత్నిస్తామన్నారు. తద్వారా వాళ్లు కూడా ఒక రోజు విమానాల్లో తిరగగలుగుతారని చెప్పారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టులను తమ హయాంలోనే నిర్మించామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ప్రజల్లో చీలిక తెచ్చి గెలవాలని బీజేపీ యత్నిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోంది తప్ప.. దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాదని చెప్పారు. ఈ సభల్లో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సీపీ జోషి, సీఎం గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు.