బీసీ క్రీమీలేయర్‌ను రద్దుచేయాలి | Sakshi
Sakshi News home page

బీసీ క్రీమీలేయర్‌ను రద్దుచేయాలి

Published Fri, Dec 25 2015 1:33 AM

బీసీ క్రీమీలేయర్‌ను రద్దుచేయాలి - Sakshi

వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ క్రీమీలేయర్ వర్తింపజేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వివిధ రాజకీయ పక్షాలు, బీసీ విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందుకోసం ఈనెల 27న అన్నిజిల్లాల్లో ధర్నాలు, 30న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం దిగిరాకపోతే రాజకీయపార్టీలు, సంఘాలను సంప్రదించి రాష్ర్ట బంద్ నిర్వహిస్తామని హెచ్చరించాయి.

గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీలకు క్రీమీలేయర్ అమలు చేయడం పెద్ద కుట్ర అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాయ మాటలతో మభ్యపెట్టి, కుటిల రాజకీయాల్లో సిద్ధహస్తుడైన మాకియవెల్లీ కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు ఓడిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి గండికొట్టేందుకే క్రీమీలేయర్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు.

హిజ్రాలను బీసీల్లో కలపడం అవమానకరమని, ఓసీల్లో చేర్చితే వారు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని వ్యాఖ్యానించారు. నిద్ర నటిస్తున్న కేసీఆర్‌కు బీసీల ఉద్యమం ద్వారా వాత పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకుంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగలకుండా ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. సామాజిక అంశాన్ని ఆర్థిక అంశంగా విడదీసే కుట్ర జరుగుతోందని టీటీడీపీ అధికారప్రతినిధి అరవింద్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల తేనెతుట్టె కదిపితే గతంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు.

ఇటువంటి చర్యలకు పాల్పడితే యాగాలు కాదు సమాధి కడతారని తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, బీసీ నేత నారగోని, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, బీసీ ఉద్యో గ, మహిళ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు నిరంజన్, గుజ్జ కృష్ణ, శారదాగౌడ్, ర్యాగ రమేశ్, నీల వెంకటేశ్, విక్రమ్‌గౌడ్, వెంకన్న, బైరి నరేశ్, సాంబశివ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement