
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 474 రిజిస్టర్ పొలిటికల్ పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. వరుసగా ఆరేళ్ల పాటు పోటీ చేయకపోవడంతో రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనలో భాగంగా గుర్తింపులేని పార్టీలపై ఈసీఐ దృష్టి పెట్టింది. మొదటి విడతలో 334 రిజిస్టర్డ్ పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా 474 పార్టీల గుర్తింపు రద్దు చేసింది.
దీంతో ఇప్పటివరకు మొత్తం 808 రిజిస్టర్ పార్టీల గుర్తింపును ఈసీఐ రద్దు చేసింది. మరో 359 పార్టీల గుర్తింపు రద్దు చేసే ప్రక్రియలో ఈసీఐ ఉన్నట్లు సమాచారం. తాజాగా ఏపీలో 17, తెలంగాణలో 9 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇప్పటివరకు 2520 గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని పేర్కొంది.