తెలంగాణ జిల్లాల్లో కల్తీకల్లు మరణాలు ఆగడం లేదు. సోమవారం మరో నలుగురు కల్లు బాధితులు మరణించారు.
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో కల్తీకల్లు మరణాలు ఆగడం లేదు. సోమవారం మరో నలుగురు కల్లు బాధితులు మరణించారు. వీరిలో ఇద్దరు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో 120 మంది, మెదక్ జిల్లాలో 30 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి గౌరీశంకర్‌కాలనీలో నివాసముంటున్న కుమ్మరి లక్ష్మమ్మ(65)కు నాలుగు రోజులుగా మతిస్థిమితం లేదు.
అస్వస్థతకు గురైంది. తల్లి పరిస్థితిని గమనించి మిడ్జిల్ మండలం దోనూరు నుంచి కల్లు తీసుకురమ్మని భార్యను పంపించాడు. అనంతరం లక్ష్మమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే జిల్లా బొంరాస్‌పేట మండలం ఎన్కెపల్లికి చెందిన జోగు మణెమ్మ(75) కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయింది. దీంతో సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను చుట్టుపక్కలవారు కొడంగల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.
జడ్చర్ల మండలం బండమీదిపల్లికి చెందిన గూళ్ల వెంకటమ్మ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. మెదక్ జిల్లా అందోలు మండలం పోసానిపేటకు చెందిన గడ్డమీది బాగయ్య (50) అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం కల్లు తాగేం దుకు దుకాణానికి వెళుతుండగా మార్గమధ్యంలో కుప్పకూలిపోయి చనిపోయాడు. కాగా, మహబూబ్‌నగర్ 336, మెదక్ 30, ఆదిలాబాద్ జిల్లాలో 120 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వారి వింత ప్రవర్తనలతో బాధిత కుటుంబాలు, వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
450 సీసాల కల్లు స్వాధీనం
నల్లగొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్‌లో సోమవారం పోలీసులు 450 లీటర్ల కల్తీ కల్లుతోపాటు మత్తు పదార్థాలను పట్టుకున్నారు.