'ప్రధానమంత్రి రిగ్గింగ్ చేయించారు' | A massive protest in PoK over the rigged in elections | Sakshi
Sakshi News home page

'ప్రధానమంత్రి రిగ్గింగ్ చేయించారు'

Jul 27 2016 3:48 PM | Updated on Aug 14 2018 5:56 PM

ఇటీవల పీవోకేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎస్ఐని రంగంలోకి దింపి ప్రధాని నవాజ్ షరీఫ్ రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి..

ముజఫరాబాద్: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష పార్టీలు, సాధారణ ప్రజలు చేపట్టిన ఆందోళనలతో పాక్ ఆక్రమిత్ కశ్మీర్(పీవోకే) అట్టుడికిపోతున్నది. జులై 21న వెల్లడైన 'ఆజాద్ జమ్ము కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ' ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్).. 42 స్థానాలకు గానూ 32 చోట్ల గెలుపొందింది. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, జాబితాలో పేరున్న పౌరులకు ఓట్లు వేసే అవకాశమే దక్కలేదని, ఐఎస్ఐని రంగంలోకి దింపి ప్రధాని నవాజ్ షరీఫ్ రిగ్గింగ్ కు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం పీవోకే విపక్షాలు చేపట్టిన బంద్ పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. పీవోకే రాజధాని నగరమైన ముజఫరాబాద్ సహా కోట్లి, చినారి, మిర్పూర్ పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించిన ఆందోళనకారులు రహదారులపై టైర్లు తగులబెట్టారు. మొన్నటివరకు అధికారంలో ఉండి, ఇప్పుడు నవాజ్ పార్టీ చేతిలో దెబ్బతిన్న ఆల్ జమ్ముకశ్మీర్ ముస్లిం లీగ్(ఏజేకేఎంఎల్) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఫలితాలను రద్దు చేసి, తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు డిమాండ్ చేశాయి.

పీవోకేలో జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ 'అక్కడ హక్కుల ఉల్లంఘన జరుతుతున్నదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలిసిందే' అన్నారు. ఇప్పటికైనా పీవోకే ప్రజల మనోభావాలను గౌరవించాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement