సిమీ ఉగ్రవాదులకు జీన్స్‌ వెనుక మిస్టరీ! | 8 SIMI activists killed after Bhopal jailbreak | Sakshi
Sakshi News home page

సిమీ ఉగ్రవాదులకు జీన్స్‌ వెనుక మిస్టరీ!

Oct 31 2016 5:14 PM | Updated on Sep 4 2017 6:48 PM

సిమీ ఉగ్రవాదులకు జీన్స్‌ వెనుక మిస్టరీ!

సిమీ ఉగ్రవాదులకు జీన్స్‌ వెనుక మిస్టరీ!

జైలు నుంచి పరారై.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది.

భోపాల్‌: జైలు నుంచి పరారై.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. జైలు నుంచి పరారైన ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారని మధ్యప్రదేశ్‌ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై పోలీసులు చెప్తున్న సమాచారంలో స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

సోమవారం తెల్లవారుజామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేసి.. అనంతరం బెడ్షీట్లను తాడులా చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారు. అనంతరం స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఎనిమిది మంది జాడ కనుక్కొని.. వారిని ఎదురుకాల్పుల్లో హతమార్చారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హతమైన ప్రదేశంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్‌ ప్యాంట్లు, స్పోర్ట్స్‌ షూలలో కనిపించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్న వారు జైలు యూనిఫాం వేసుకున్నారా? లేక జీన్స్‌ ప్యాంట్లు, స్పోర్ట్స్‌ షూస్‌ కలిగి ఉన్నారా? అన్నది తెలియదు. లేక జైలు నుంచి పరారైన తర్వాత వారు వీటిని ధరించారా? అన్నది మిస్టరీగానే ఉన్నది.

ఇక ‘మేం పట్టుకోవడానికి వెళ్లినప్పుడు ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో మేం ఎదురుకాల్పులు జరిపా’మని పోలీసులు అంటున్నారు. అయితే, జైలు నుంచి పరారై బయటకు రాగానే వారి వద్దకు ఆయుధాలు ఎలా వచ్చాయన్నది తేలలేదు. అలాగే స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పరారైన ఎనిమిది మంది జాడ కనుగొన్నామని భోపాల్‌ ఐజీ యోగేష్‌ చౌదరి చెప్తుండగా.. నిజానికి ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం జనావాసాలకు రెండుమైళ్ల దూరంలో ఉంది. అక్కడ జనసంచారం కూడా లేదని తెలుస్తోంది. ఇలాంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తును మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. అలాగే, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జైలుశాఖ సీనియర్‌ అధికారులపై వేటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement