
ఆరుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
స్పీకర్ తీవ్ర నిర్ణయం.. ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు..
న్యూఢిల్లీ: సభలో తనపట్ల అనుచితంగా వ్యవహరించిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ వేటు వేశారు. వారిని ఐదురోజుల పాటు సభ నుంచి బహిష్కరించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం లోక్‌సభలో దుమారం రేపారు. వెల్‌లోకి దూసుకొచ్చిన ఆ పార్టీ సభ్యులు మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు కాగితాలు చింపి స్పీకర్ మహాజన్‌పై విసిరేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ మహాజన్ ఐదుగురు సభ్యులపై వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గౌరవ్ గొగోయ్, కే సురేశ్, అధీర్ రంజన్ చౌదరి, రంజీత్ రంజన్, సుష్మితా దేవ్, ఎంకే రాఘవన్‌లను సభనుంచి ఐదురోజులపాటు బహిష్కరించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2.30 గంటలవరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా పరిస్థితి మారలేదు. తమ పార్టీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వులను తప్పుబడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ నడిచే పరిస్థితి లేకపోవడంతో మంగళవారానికి స్పీకర్ మహాజన్ వాయిదా వేశారు.