వైమానిక దాడుల్లో 3800 మంది హతం
రష్యా ఒక్క ఏడాదిలోనే 3,800 సిరియన్ పౌరుల్ని పొట్టనపెట్టుకున్నదని ప్రముఖ అంతర్జాతీయ మానవహక్కుల పర్యవేక్షణా సంస్థ పేర్కొంది.
బీరట్: అగ్రరాజ్యం అమెరికా వద్దంటున్నా, ప్రపంచ దేశాలు వారిస్తున్నా అత్యంత ప్రమాదకరమైన బాంబులను ఆకాశం నుంచి జారవిడుస్తోన్న రష్యా ఒక్క ఏడాదిలోనే 3,800 సిరియన్ పౌరుల్ని పొట్టనపెట్టుకున్నదని ప్రముఖ అంతర్జాతీయ మానవహక్కుల పర్యవేక్షణా సంస్థ పేర్కొంది. అధ్యక్షుడు బషర్ అల్- అసద్ సేనకు మద్దతుగా సిరియా గగన తలం నుంచి దాడులు నిర్వహిస్తోన్న రష్యన్ యుద్ధవిమానాలు.. ఐసిస్, ఇతర తిరుగుబాటుదాలనేకాక అమాయక ప్రజలను కూడా బలితీసుకుంటున్నాయని తెలిపింది.
రష్యా యుద్ధవిమానాలైతేనేమి, సిరియా సైనిక దాడులైతేనేమీ ఏడాది కాలంలో సిరియాలో మొత్తం 9,300 మంది చనిపోయారని, వారిలో 2700 మంది ఐసిస్ జిహాదీలు, ఇతర తిరుగుబాటు గ్రూపులకు చెందిన 2800మంది కూడా ఉన్నారని అధ్యయన సంస్థ డైరెక్టర్ రమి అబ్దుల్ రెహమాన్ శుక్రవారం మీడియాకు తెలిపారు. రష్యా వైమానిక దాడుల్లో మరణించినవారేకాక 20వేల మందికిపైగా పౌరులు గాయపడ్డారని చెప్పారు. దాడులకు ఉపయోగించిన విమానాలు, అవి మోసుకెళ్లే బాంబుల సామర్థ్యం తదితర వివరాలతోపాటు ప్రత్యక్షంగా సిరియాలో పనిచేస్తోన్న తమ కార్యకర్తల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ గణాకాలను రూపొందిచామని హక్కుల సంస్థ పేర్కొంది. వాషింగ్టన్ నుంచి ఒత్తిడి ఎదురైనాసరే, సిరియాలో దాడులు కొనసాగిస్తామని బుధవారం రష్యా ప్రకటించింది. ఇది వెలువడిన కొద్ది గంటలకే సిరియాలో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయినవారి సంఖ్య వెలుగులోకి రావడం గమనార్హం.


