ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

ZPTC And MPTC Election Counting Ps Peaceful In Telangana - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. 17 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు మేలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత నెల 6, 10, 14వ తేదీల్లో ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలైన ఓట్లను మంగళవారం లెక్కించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలో ఐదు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో మూడు, బోథ్‌లో ఒకటి, ఉట్నూర్‌లో ఒక లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, భీంపూర్, తలమడుగు, ఇచ్చోడ, సిరికొండ, మావల, గుడిహత్నూర్‌ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కించగా, నేరడిగొండ, బోథ్, బజార్‌హత్నూర్‌ మండలాల్లోని ఆయా స్థానాల ఓట్లను బోథ్‌ మండల కేంద్రంలో లెక్కించారు. ఇక ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్‌ మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను ఉట్నూర్‌లోని బీఈడీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గత పక్షం రోజుల నుంచి పరిషత్‌ లెక్కింపుపై దృష్టి సారించిన అధికారులు కౌంటింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు బోథ్, ఉట్నూర్‌లలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది. కాగా, ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు  ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్, సాధారణ పరిశీలకులు చిరంజీ వులు, ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ పరిశీలించారు.
 
మధ్యాహ్నం ఎంపీటీసీ,  సాయంత్రం జెడ్పీటీసీ.. 
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11 గంటల వరకు నెమ్మదిగా జరిగింది. దీంతో మొదటి ఫలితం రావడానికి చాలా సమయం పట్టింది. ముందుగా ఎంపీటీసీ ఓట్లను, తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. కొన్ని మండలాల్లోని అన్ని ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు దాదాపు ఏడు గంటల సమయం పట్టగా, ఇంకొన్ని మండలాల ఓట్ల లెక్కింపు త్వరగానే పూర్తయింది. లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల అనంతరం ఒక్కో స్థానం ఫలితాలు వెల్లడి కావడంతో కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లలో ఉత్కంఠ మొదలైంది. ఒక స్థానం తర్వాత ఒక స్థానం ఫలితాలు ఒక్కోక్కటిగా వెల్లడించడంతో గెలిచిన వారు ఆనందంగా, ఓడిన వారు నీరసంగా కన్పించారు.

ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు అనంతరం బ్యాలెట్‌ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు చేపట్టారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పత్రాలను వేరు చేశారు. మళ్లీ ఆయా స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల వారీగా సెపరేట్‌ చేశారు. అనంతరం 25 బ్యాలెట్‌ పత్రాలకు ఒక బండల్‌ చొప్పున కట్టకట్టడంతో మొదటి ఫలితం రావడానికి చాలా సమయం పట్టింది. అలా కట్టకట్టిన అనంతరం లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రియ అంతా ఆయా పార్టీల ఏజెంట్ల ముందు జరగడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఫలితాల వెల్లడి ప్రారంభమైన రెండు గంటల్లోపే అన్ని ఎంపీటీసీ స్థానాల ఫలితాలు పూర్తయ్యాయి. ఒక్కో మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో అక్కడ పూర్తి ఫలితాల వెల్లడికి కొద్ది సమయం పట్టింది. మూడు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న మండలంలో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును మధ్యాహ్నమే చేపట్టగా, ఆ మండలాల జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం 4 గంటల నుంచే మొదలయ్యాయి.

కేంద్రాల చుట్టు పక్కల భారీ భద్రత 
పరిషత్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాల చుట్టూ పక్కల భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో లెక్కింపు కేంద్రాలు ఉండగా, ఆయా కేంద్రాల్లోని కౌంటింగ్‌ హాళ్ల ముందు మండల ఎస్సైలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. సదరు మండలం ఓట్ల లెక్కింపు హాల్‌ వద్ద అదే మండల ఎస్సై, ఇతర పోలీసులు భద్రత బాధ్యతలు నిర్వర్తించడంతో కౌంటింగ్‌ హాళ్ల ముందు, లోపల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఆ మండల పరిధిలోని ఏజెంట్లుగా అందరు తెలిసిన వారుండడంతో లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. దీంతోపాటు లెక్కింపు కేంద్రాలకు ముందు రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ హాల్‌ ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు రోడ్డుపై భారీకేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రజలను, వాహనాలను దారి మళ్లీంచారు. దీంతో ఎక్కడా కూడా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top