ప్రేమించి మోసపోయిన ఓ యువతి.. ప్రియుడు, అతని మరో ప్రియురాలి వేధింపులు, నిందారోపణలు భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
కమలాపూర్ (వరంగల్) : ప్రేమించి మోసపోయిన ఓ యువతి.. ప్రియుడు, అతని మరో ప్రియురాలి వేధింపులు, నిందారోపణలు భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఉప్పల్‌కు చెందిన బండారి భద్రయ్య-లక్ష్మి దంపతుల పెద్ద కూతురు శ్రీలత(21) బీటెక్ పూర్తి చేసి హన్మకొండలోని టైమ్ ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాంకు ఉద్యోగం కోసం కోచింగ్‌కు వెళ్తోంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే శ్రీలత ఉప్పల్‌కు చెందిన పులుగం రాకేశ్‌తో ప్రేమలో పడి అతడిని పూర్తిగా నమ్మింది. అప్పటి నుంచి రాకేశ్ శ్రీలతను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకుంటున్నాడు. మూడేళ్లుగా రాకేశ్ తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే.. తన బాబాయి కూతురు విజయను ప్రేమిస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఆమెకు తెలిసింది.
దీంతో విజయ, రాకేశ్‌లు కలిసి శ్రీలతను ఏడిపించేవారు. వేరొకరితో సంబంధాలు అంటగడుతూ వేధించేవారు. సుమారు పది రోజులుగా వీరి వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీలత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 15న కోచింగ్‌కు అని ఇంట్లో నుంచి వెళ్లిన శ్రీలత తిరిగి రాలేదు. దీంతో మరునాడు తండ్రి భద్రయ్య కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న రాత్రి కాజీపేట ఫాతిమానగర్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీలత తండ్రి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ ఎస్సై ఎల్లయ్య శుక్రవారం తెలిపారు. శ్రీలతపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు సైతం నమోదై ఉంది.