మనసా.. తుళ్లిపడకే..

World Mental health Day Special Story - Sakshi

సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక ఆనందం అవసరం

ఆధునిక జీవితంలో ఒత్తిడిలో70 శాతం మంది

మానసికి రుగ్మతలబారిన పడుతున్న వారు20 శాతం మంది

గుర్తించి చికిత్స పొందుతున్న వారు అతి స్వల్పమే

నేడు ‘ప్రపంచ మెంటల్‌ హెల్త్‌ డే’

కలెక్టరేట్‌: మనసు నిర్మలంగా ఉందంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే ఏదైనా పనిచేసేముందు ప్రశాతంగా ఆలోచించాలంటారు. మనం చేసే ఆలోచనలు.. వాటి ఆచరణ వల్ల వచ్చే ఫలితాలు ఆ పనిచేసినవారితో పాటు చుట్టు పక్కలవారిపై ప్రభావం చూపిస్తాయి. అయితే మనసు బయటకు కనిపించకపోయినా దాని మూలంగా వచ్చే ఫలితాలు మాత్రం కనిపిస్తాయి. అది మంచైనా.. చెడైనా సరే అంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలోచించే మెదడు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే గల్లంతవుతుంది. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించాలంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి. నేడు ‘ప్రపంచ మెంటల్‌ హెల్త్‌ డే’ సందర్భంగా మానసిక ఆరోగ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  

ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై మరొకటిæ ఆధారపడి ఉంటాయి. మనిషిలోని దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అలాగే మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే శారీరక అనోగ్యానికి కారణమవుతుంది. మానసిక రోగం పేరు చెబితే చాలా మంది భిన్నంగా ఆలోచిస్తుంటారని, ఆ సమస్యను ‘పిచ్చి’గా భ్రమ పడుతుంటారని ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.ఉమాశంకర్‌ వివరించారు. పొరపాటున అలాంటి వ్యాధి తమకున్నట్టు వారు భావిస్తే జబ్బు తీవ్రత కంటే వీరి ఆలోచనల్లో సంఘర్షణ వల్ల మానసిక అనారోగ్యం కాస్త వింత ప్రవర్తనకు దారితీస్తుందంటున్నారు.

70 శాతం మందికి ఒత్తిడి
ప్రస్తుత సమాజంలో దాదాపు 70 శాతం మంది రకరకాల ఒత్తిళ్లతో జీవిస్తున్నారు. పని ఒత్తిడి లేని రంగం అంటూ లేదు. వీరిలో 20 శాతం మంది మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సతో వాటి నుంచి బయటపడున్నారని డాక్టర్‌ ఉమాశంకర్‌ చెబుతున్నారు. మానసిక రగ్మతల్లోనూ లక్షణాలను బట్టి వైద్య పరిభాషలో వివిధ పేర్లతో పిలుస్తారు. డిప్రెషన్, యాంగ్జయిటీ, న్యూరోసిస్, బైపోలార్‌ డిజార్డర్, సోషల్‌ యాంగ్జయిటీ, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్, పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్, ఫోబియా, మానియా, స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్‌ డిజార్డర్, స్లీప్‌ డిజార్డర్‌ (ఇన్‌సోమ్నియా), ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్‌.. ఇలాంటివన్నీ మానసిక సంబంధమైనమే. ఈ ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోతే రుగ్మతను తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలకు చాలా కారణాలు ఉంటాయంటున్నారు మానసిక వైద్యులు. సామాజికంగా వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి, పోటీ, జీవితాశయాలను చేరుకోలేకపోవడం, వైఫల్యాలు వంటి అనుభవాలు మానసికారోగ్య స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ప్రారంభంలోనే వాటిని గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే ఓకే గాని.. పట్టించుకోకుంటే మాత్రం అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆయా వ్యక్తులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు బాసటగా నిలిస్తే వారు త్వరగా కోలుకుంటారు.

లక్షణాలను గుర్తించడమూ కష్టమే..
శారీరక అనారోగ్యాలను నిర్ధారించేందుకు ఎన్నో వైద్య పరికరాలు ఉన్నాయి. కానీ మానసిక వ్యాధులను అంత సులువుగా గుర్తించలేమంటున్నారు మానసిక వైద్యనిపుణులు. వ్యక్తిత్వ వైఫల్యాలు, అసహజ ప్రవర్తన, విపరీత ధోరణులు, ప్రతికూల ఉద్వేగాలు ఇతర లోపాలను పరిశీలించాకే మానసిక రుగ్మతలను అంచనా వేయగలమంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషిలోను ప్రేమ, కోపం, చిరాకు, భయం వంటివి ఉంటాయి. అవి మితిమీరితే మాత్రం మానసిక రుగ్మతకు దారితీస్తుంది. నిరంతరం తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి, ఆత్మన్యూనత, స్వీయ సానుభూతి, ఆత్మ నిందలతో కుంగిపోవడం, నేర ప్రవృత్తి, మాదకద్రవ్యాలు తీసుకోవడం, వ్యభిచారం తదితర దుర్వ్యసనాల పట్ల మొగ్గు చూపడం, బాధ్యతలను తప్పించుకుంటూ, బంధాలకు దూరమవడం, విపరీతమైన సిగ్గు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే ఊహించుకుంటూ కాలం గడపడం వంటివన్నీ ఆ కోవకు చెందినవేనంటున్నారు వైద్యులు.

చాలా జాగ్రత్తలు అవసరం  
మానసిక, శారీరక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి గనుక ఒకదానికి చికిత్స తీసుకునేటప్పుడు రెండోదాని క్కూడా తీసుకోవడం మంచిది. మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత, ఆత్మీయత అవసరం. అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను, స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సిలింగ్, తర్వాత మందులతో చికిత్స చేస్తాం. మానసిక అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసినా, చికిత్స మధ్యలో ఆపేసినా పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది.– డాక్టర్‌ ఆర్‌.అనిత, ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ మెంటల్‌ హెల్త్, ఎర్రగడ్డ   

ఆహార నియమాలూ ముఖ్యమే..  
మనం తీసుకునే ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజువారీ ఆహారంలో కొద్దిగా ఆలివ్‌ నూనె తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను సక్రమంగా ఉంచుతుంది. ముఖ్యంగా మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్‌ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు సమృగా లభించే చేపలు ఆహారంలో భాగం కావాలి. యాపిల్, పాలకూర, డ్రైఫ్రూట్స్, బీన్స్, గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిది.– డాక్టర్‌ ఎం. ఉమాశంకర్,ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌సూపరింటెండెంట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top