నియామకాలలో మాయాజాలం | worker posts in SC hostels will lead by agencies | Sakshi
Sakshi News home page

నియామకాలలో మాయాజాలం

Jun 26 2015 10:13 AM | Updated on Apr 3 2019 9:27 PM

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల నియామకంలో ఏజెన్సీదారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందూరు : నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల నియామకంలో ఏజెన్సీదారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తమకు అనుకూలమైన అభ్యర్థుల పేర్లు జాబితాలో పెట్టి ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిసింది. అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం చాంబర్‌లో ఆయన అధ్యక్షతన  గురువారం ఇంటర్వ్యూలు జరిగాయి.
 
వసతిగృహాలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు వండిపెట్టేందుకు కుక్, వంట పాత్రలు కడిగేందుకు కామాటి, రాత్రుల్లో కాపలా ఉండేందుకు వాచ్ మెన్.. ఇలా మొత్తం 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు కలెక్టర్ అనుమతి తీసుకున్న సంక్షేమాధికారులు హైదరాబాద్‌కు చెందిన శక్తి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు.  నియమితులైన వర్కర్‌లకు వేతనాలు చెల్లించడమే ఏజెన్సీ పని. కానీ ఈ సారి నిబంధనలు అలా లేవంటున్నారు సంక్షేమాధికారులు. అభ్యర్థుల పేర్లను కూడా ఏజెన్సీ వారే సిద్ధం చేసి సంక్షేమాధికారులకు అప్పగించారు. 46 పోస్టులకు 200 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు.
 
నిజానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన వర్కర్ పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా ఉపాధి కల్పన కార్యాలయం నుంచి నిరుద్యోగ అభ్యర్థుల జాబితాను సీనియార్టీ ప్రకారం తీసుకోవాలి. లేదంటే తాత్కాలింకంగా వసతి గృహాల్లో పని చేస్తూ, ఎంప్లాయిమెంట్ కార్డు కలిగి సీనియార్టీ ఉన్న వారిని తీసుకుని ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయాలి. అలా కాకుండా ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు, మరి కొన్ని ఏజెన్సీకి అనుకూలమైన వారి పేర్లను జాబితాలో పెట్టి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీంతో చాలా మంది నిరుద్యోగులకు నష్టం వాటిల్లింది. ఉపాధి కల్పన శాఖకు సంబంధం లేకుండా చేయడమేంటని పలువురు సంక్షేమ శాఖల ఉద్యోగులే ముక్కున వేలేసుకోవడం గమనార్హం. ఎంపికకు ముందే సదరు ఏజెన్సీదారులు అభ్యర్థులతో ముందుగానే ముడుపుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఒక్కో పోస్టుకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు మాట్లాడుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
 
నిబంధనల ప్రకారమే ఎంపిక...
‘నిబంధనలకు లోబడే అవుట్ సోర్సింగ్ పద్ధతిన హాస్టల్ వర్కర్‌లను ఎంపిక చేస్తున్నాం. 200 మంది అభ్యర్థుల జాబితా తయారు చేసి ఏజెన్సీ వారు మాకిచ్చారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 46 మందిని ఎంపిక చేశాం. ఉపాధి కల్పన శాఖ నుంచి నిరుద్యోగుల సీనియార్టీ జాబితా ప్రకారం చేయాలనే నిబంధన లేదు. ఏజెన్సీ వారే జాబితా తయారు చేయాలని నిబంధన ఉంది. దీని ప్రకారమే చేస్తున్నాం’                   - ఖాలేబ్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement