కారడవిలో అక్రమాల ‘కోడి’ | Poultry Scheme for Tribal Livelihoods Faces Setbacks: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కారడవిలో అక్రమాల ‘కోడి’

Apr 26 2026 5:29 AM | Updated on Apr 26 2026 5:29 AM

Poultry Scheme for Tribal Livelihoods Faces Setbacks: Andhra Pradesh

అడవి బిడ్డలకు పెరటి కోళ్ల పేరిట నిధులు బొక్కేసేందుకు స్కెచ్‌

రూ.7.96 కోట్ల కేంద్ర నిధులతో చేపట్టే ప్రాజెక్ట్‌లో నిబంధనల ఉల్లంఘన

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా.. టెండర్‌ పిలవకుండా.. ప్రైవేట్‌ సంస్థతో నేరుగా ఒప్పందం

లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ఆ సంస్థే చక్కబెట్టేలా ప్రణాళిక

నిబంధనలకు విరుద్ధంగా ఐటీడీఏ పీఓ ఖాతాలకు నూరు శాతం అడ్వాన్సులు

యానాదుల సంఘం ఫిర్యాదుతో వెలుగులోకి అక్రమాలు

సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘పెరటి కోళ్ల పెంపకం పథకం’లో అక్రమాలు కోడై కూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.7.96 కోట్లను మింగేసేందుకు నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఏపీ ఎస్టీ కమిషన్‌కు రాష్ట్ర యానాదుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమాలు, అవినీతిపై ఆరోపణల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(పీఓ) నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందంతో విచారణ కమిటీని నియమించారు.

దీంతో అక్రమాల విలువతోపాటు ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి వాటా ఎంత అనేది తేలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి అడ్వాన్సుల చెల్లింపుల వరకు అడ్డగోలు నిర్ణయాలు అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయనే విషయం సంఘం ఫిర్యాదుతో బట్టబయలైంది. రాష్ట్రంలోని ఆరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 4,593 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాల్సిన ఈ పథకం పక్కదారి పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా కేటాయించారు
ఆరు ఐటీడీఏల పరిధిలో మొత్తం రూ.7,96,25,000 కేటాయించారు.
పాడేరు, రంపచోడవరం, కోట రామచంద్రాపురం, పార్వతీపురం, నెల్లూరు, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 25 మండలాల్లో 4,593 మంది గిరిజన లబ్ధిదారులను గుర్తించారు.

ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇప్పటికే రూ.6,88,95,000 మంజూరు చేశారు.
కోళ్ల ఉత్పత్తికి బ్రీడర్‌ యూనిట్స్‌ ఒక్కొక్క దానికి రూ.1.25 లక్షల చొప్పున మొత్తం 50 యూనిట్లకు రూ.62.50 లక్షలు కేటాయించారు.

కోళ్ల మేత నిమిత్తం ఒక్కో ఫీడ్‌ మిల్‌ ఏర్పాటుకు రూ.3.60 లక్షల చొప్పున మొత్తం 8 ఫీడ్‌ మిల్స్‌కు రూ.28.80 లక్షలు కేటాయించారు.
కోళ్ల ఉత్పత్తి పేరిట ఒక్కో హేచరీకి రూ.2 లక్షల చొప్పున మొత్తం 8 హేచరీలకు రూ.16 లక్షలు కేటాయించారు.

నోటిఫికేషన్‌ లేదు.. టెండర్‌ పిలవలేదు
ఏ పథకాన్ని అయినా ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాల­నుకుంటే నోటిఫికేషన్‌ జారీ చేయడం లేదా టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా పెరటి కోళ్ల పెంపకం పథకంలో ఎటువంటి నోటిఫికేషన్, టెండర్‌ పిలవకుండానే ఓ ప్రైవేట్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర నిధులు నూరు శాతం లబ్ధిదారులకే కేటాయించే అవకాశం ఉన్న ఈ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ అధికారులతో అమలు చేయవచ్చు. అందుకు విరుద్ధంగా ప్రైౖవేట్‌ ఏజెన్సీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకోవడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారు. ఆ ఏజెన్సీని అడ్డు పెట్టుకుని నిధుల్ని బొక్కేందుకు ఆ శాఖలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

కోళ్లు కొనకుండానే అడ్వాన్సులు
ఏ పథకంలో అయినా లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు, కొనుగోళ్లు వంటి ప్రక్రియలు చేపట్టిన తర్వాతే నిబంధనల ప్రకారం ప్రభుత్వం దశలవారీగా నగదును బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మాత్రం ఆరు ఐటీడీఏల ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల ఖాతాలకు ముందస్తు (అడ్వాన్స్‌)గా నిధులు పూర్తిగా జమ చేయడం గమనార్హం. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, కోళ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని పీఓలపై ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పథకం ప్రకారమే పీఓల ఖాతాలకు నగదు జమచేసి.. ఆ తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చి కోళ్ల కొనుగోలు పేరుతో అయిన వారికి వాటిని జమ చేసేలా స్కెచ్‌ వేశారు. అలా చేయడం ద్వారా అంతా అధికారికంగా చేసినట్టు చూపి మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం
కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజనులకు అందించే పెరటి కోళ్ల పెంపకం యూనిట్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయపై ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. ఈ నేపథ్యంలోనే పాడేరు పీఓ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి విచారణ చేయిస్తున్నట్టు చెప్పారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని నూరు శాతం సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేపడతాం.       – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, ఏపీ యానాదుల సంఘం

Advertisement
 
Advertisement
Advertisement