2040లో చంద్రుడిపై మన జెండా | India wants to land astronauts on the moon in 2040 | Sakshi
Sakshi News home page

2040లో చంద్రుడిపై మన జెండా

Apr 25 2026 12:43 PM | Updated on Apr 25 2026 12:50 PM

India wants to land astronauts on the moon in 2040

పిల్లలూ, రాత్రి పూట ఆకాశంలో నవ్వుతూ కనిపించే చందమామ మీదకు మనం వెళ్లొచ్చా? వెళ్లడమే కాదు, అక్కడ మన మువ్వన్నెల జెండా కూడా  పాతేయొచ్చా? పాతేయొచ్చు’ అని గట్టిగా చెప్పారు నారాయణన్‌. హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ‘2040 సంవత్సరానికి ఒక భారతీయుడు చందమామ మీద కాలు పెడతాడు. చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది’ అని మాట ఇచ్చారు. నారాయణన్‌ చెప్పిన విశేషాలు ఇలా అర్థం చేసుకోవాలి.

మొదట గగనయాన్‌
చందమామ చాలా దూరం. వెళ్లడం చాలా కష్టం. అందుకే మన సైంటిస్ట్‌లు ఇప్పటి నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. మొదట 2027లో ‘గగనయాన్‌’ మిషన్‌ నిర్వహిస్తారు. అంటే ముగ్గురు వ్యోమగాములను భూమి చుట్టూ తిప్పి తీసుకువస్తారు. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ నాయర్, గ్రూప్‌ కెప్టెన్‌ అజిత్‌ కృష్ణన్, గ్రూప్‌ కెప్టెన్‌ అంగద్‌ ప్రతాప్‌ సింగ్, కమాండర్‌ శుభాంశు శుక్లా లను సెలెక్ట్‌ చేశారు. వీరిలో ముగ్గురు వెళ్లి వస్తారు.

చంద్రయాన్‌– 4,5:
చంద్రయాన్‌లో భాగంగా  2027లో ఎ20 ఉపగ్రహం  పంపుతారు. అది ఆకాశంలోంచి భూమిని చూస్తూ, ‘అమ్మో, ఇక్కడ కాలుష్యం ఎక్కువైంది, అక్కడ వర్షాలు తక్కువైయ్యాయి’ లాంటి వార్తలు చేరవేస్తుంది. 2028కి వచ్చేసరికి అంతరిక్షంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం. దాని పేరు ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’. మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక చంద్రయాన్‌–4లో మన రాకెట్‌ని పంపి, చందమామ మీద వాలేలా చేస్తారు. అది అక్కడి మట్టిని, రాళ్లను ఒక డబ్బాలో పెట్టుకుని మళ్లీ భూమి మీదకు తీసుకొస్తుంది. ఆ మట్టిలో ఏముందో ల్యాబ్‌లో చూస్తాం. 2030లో నిర్వహించే చంద్రయాన్‌–5 ఇంకా పెద్దది. అది ఒక పెద్ద ల్యాండర్‌ని, చిన్న కారు లాంటి రోవర్‌ని చందమామ మీద దింపుతుంది. ఆ రోవర్‌ వంద రోజులు చందమామ వీధులన్నీ తిరిగి ఫోటోలు, వీడియోలు పంపుతుంది. ఇవన్నీ అయ్యాక, అన్నీ సక్సెస్‌ అయ్యాక... 2040లో  ‘మానవ సహిత చంద్రయాన్‌’ నిర్వహిస్తారు. ఆ రోజున మన భారతీయుడు రాకెట్‌ ఎక్కి, చందమామ మీద దిగి, ‘భారత్‌ మాతా కీ జై’ అని అక్కడ మన జెండా పాతుతాడు. 

ఇదీ చదవండి: సెలబ్రిటీ చెఫ్‌కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్‌, వీడియో వైరల్‌

మీరూ వెళ్లొచ్చు
పిల్లలూ... ఇప్పుడు నీకు 12 ఏళ్లా? 2040కి మీకు 28 ఏళ్లు. అంటే ఆ రాకెట్‌ ఎక్కేది మీరే కావచ్చు! అందుకే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. లెక్కలు, సైన్స్‌ అంటే భయపడకూడదు. ఆటలు ఆడాలి. అన్నం బాగా తిని బలంగా తయారవ్వాలి. చందమామ మన కోసం చూస్తున్నాడు. వెళ్లి ‘జైహింద్‌’ చెప్పొద్దూ?

Advertisement
 
Advertisement
Advertisement