‘లేడీస్‌’ స్పెషల్‌

Women Railway Stations Starts in Begumpet - Sakshi

నగరంలో మహిళా రైల్వేస్టేషన్లు

బేగంపేట్, విద్యానగర్‌లో మహిళా రైల్వే స్టేషన్లు

లాంఛనంగా ప్రకటించిన రైల్వే జీఎం వినోద్‌కుమార్‌

ఆయా స్టేషన్లలో మహిళలే సారథులు  

సబర్బన్‌ రైళ్లలో ‘నిర్భయ రక్షణ బృందాలు’  

లోకోపైలట్‌ సత్యవతికి రైల్వే జీఎం అభినందన

ఆర్టీఏలో ప్రత్యేక లైసెన్స్‌ కౌంటర్లు

850 మందికి ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీఏ ఆధ్వర్యంలోమహిళలకు లైసెన్స్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు.ఖైరతాబాద్‌ కార్యాలయానికి సేవల కోసం వచ్చిన మహిళతో రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌ శర్మ క్యాంపును ప్రారంభించగా.. బేగంపేట్, విద్యానగర్‌ రైల్వేస్టేషన్లను మహిళా స్టేషన్లుగా దక్షిణమధ్య రైల్వే జీఎంవినోద్‌కుమార్‌ ప్రకటించారు. వీటిలో పనిచేసే సిబ్బంది అందరూ మహిళలే కావడం విశేషం. ఈ సందర్భంగాదశాబ్దానికి పైగా లోకోపైలట్‌గా సేవలందిస్తున్నసత్యవతిని జీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా రైల్వేస్టేషన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం  ప్రారంభమయ్యాయి. నగరంలోని బేగంపేట్, విద్యానగర్‌తో పాటు, గుంతకల్‌ డివిజన్‌లోని చంద్రగిరి, గుంటూరు డివిజన్‌లోని న్యూ గుంటూరు రైల్వేస్టేషన్లలో కూడా పూర్తిస్థాయి మహిళా ఉద్యోగులు, అధికారులు ఉన్న రైల్వేస్టేషన్లుగా జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా బేగంపేట్‌ మహిళా రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన  ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్‌ నిర్వహణ బాధ్యతను పూర్తిగా మహిళలకే అప్పగించడం వల్ల విధి నిర్వహణలో వారు అంకితభావం, ఆత్మస్థైర్యంతో పని చేయగలరన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో మహిళా ఉద్యోగుల కృషి ఉంటుదని ఆయన అన్నారు. 

ప్రత్యేక సదుపాయాలు..
మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలోనూ దక్షిణమధ్య రైల్వే ముందు వరుసలో ఉందని జీఎం వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రత్యేకంగా మహిళల కోసం వెయిటింగ్‌ హాళ్లు, తల్లులు పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాచిగూడ, బేగంపేట్‌ తదితర రైల్వేస్టేషన్లలో శానిటరీ ప్యాడ్‌లను అందుబాటులో ఉంచామన్నారు. నగరంలోని అన్ని ఎంఎంటీఎస్, సబర్బన్‌ రైళ్లలో ఆర్‌పీఎఫ్‌ మహిళా భద్రతా సిబ్బందితో ‘నిర్భయ బృందాల’ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

సత్యవతికి అభినందన..
ఈ సందర్భంగా జీఎం.. లోకోపైలెట్‌ సత్యవతిని ప్రత్యేకంగా అభినందించారు. దశాబ్దానికి పైగా ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుపుతున్న ఆమె సేవలను ప్రశంసించారు. సత్యవతి నడుపుతున్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌లోకి ఎక్కి ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వర్ధన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

ఆర్టీఏలో లేడీస్‌ స్పెషల్‌ డే..:850 మందికి పైగా ఎల్‌ఎల్‌ఆర్‌లు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలో ఆర్టీఏ నిర్వహించిన ‘లేడీస్‌ స్పెషల్‌ డే’కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘లెర్నింగ్‌ లైసెన్స్‌ మేళా’లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లైసెన్సులు తీసుకున్నారు.  ఖైరతాబాద్, సికింద్రాబాద్, బండ్లగూడ,  మెహదీపట్నం, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం.. అన్నిచోట్లా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందజేశారు. అన్ని ఆర్టీఏల్లో సుమారు 850 మందికి పైగా ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకున్నారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేళాకు రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాహనం నడపాలంటే ప్రతి ఒక్కరు డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని, విధిగా లైసెన్స్‌  తీసుకోవాలని సూచించారు. జేటీసీ పాండురంగ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. మూడేళ్లుగా మహిళల కోసం ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్, టీఎన్జీవోస్‌ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌ పాల్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top