వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అడవి పందుల దాడిలో మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గచ్చిబౌలి (హైదరాబాద్) : వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అడవి పందుల దాడిలో మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జె.రమేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డిలో నివాసం ఉండే జెర్రి అశోక్(45) ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు శంకర్ హిల్స్‌లో గల అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పొదల్లో ఉన్న పందుల గుంపు ఒక్కసారిగా అశోక్‌పై దాడి చేశాయి. మర్మాంగాలతో పాటు పొట్ట లోపల బలమైన గాయాలయ్యాయి.
కిందపడిపోయిన అశోక్‌ను స్థానికులు కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం 12న రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటలకు చనిపోయాడు. అశోక్ కుక్కలను వెంట తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, శంకర్‌హిల్స్ ప్రాంతంలో అడవి జంతువులు, పక్షులను తరచుగా వేటాడేవాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.