వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

Wife Who Killed Her Husband By her Boyfriend - Sakshi

ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య 

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

కొత్తూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనలో హత్య చేసిన నిందితుడిని, ప్రియురాలిని, సహకరించిన మరో బాలుడిని (15) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు సంబంధించిన వివరాలను కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ కృష్ణ వెల్లడించారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఎండీ ఇస్మాయిల్‌(23)కు గత రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ కిషన్‌బాగ్‌కు చెందిన అనీస్‌బేగం(19)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, అనీస్‌బేగంకు పెళ్లికి ముందే కిషన్‌బాగ్‌కు చెందిన జహీర్‌(25)తో వివాహేతర సంబంధం ఉంది.

ఈ నేపథ్యంలో ఇస్మాయిల్‌ను ఎలాగైన హత్యచేసి అడ్డు తొలగించుకోవాలని అనీస్‌బేగం ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగానే జహీర్‌ గత నెల రోజుల క్రితం అనీస్‌బేగంకు బంధువయ్యే ఓ మైనర్‌ బాలుడి సహాయంతో జేపీదర్గా ఆవరణలో కూలీ పనిచేస్తున్న ఇస్మాయిల్‌తో స్నేహం చేశాడు. నమ్మకంగా మెలుగుతూనే మైనర్‌ సహాయంతో రెండుసార్లు హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈ నెల 16న జహీర్‌ తన మొహనికి దస్తీ కట్టుకొని బైకు నంబర్‌ప్లేట్‌ చివరి రెండు అక్షరాలు కనిపించకుండా టేప్‌ అంటించి క్రికెట్‌ బ్యాట్‌తో ఒక్కడే ఇన్ముల్‌నర్వకు వచ్చాడు. అక్కడి నుంచి ఇస్మాయిల్‌తో కలిసి ఇద్దరు కిషన్‌భాగ్‌కు వెళ్లారు. మార్గమధ్యలో మద్యం సేవించడంతో పాటు గ్రామానికి వచ్చిన తర్వాత మరోమారు ఇస్మాయిల్‌కు ఎక్కువగా మద్యం తాగించి తలపై బ్యాట్‌తో మోది హత్య చేశాడు.

ఈ సంఘటనపై భార్య అనీస్‌బేగంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆమె పాత్రపై అనుమానం కలగడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. జాతీయ రహదారి ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. జహీర్‌ నేరాన్ని అంగీకరించాడు. జహీర్‌ సమాచారం మేరకు కిషన్‌బాగ్‌లోని తల్లిగారి ఇంటి వద్ద ఉన్న అనీస్‌బేగంతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తూరు పీఎస్‌కు తీసుకువచ్చి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి హోండాషైన్‌ బైకు, క్రికెట్‌ బ్యాట్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

 సీసీ పుటేజీ ఆధారంగా..  
ఈ హత్య కేసు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని సీఐ రామకృష్ణ తెలిపారు. గ్రామాల ముఖ్య కూడళ్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. హత్య కేసును ఛేదించిన ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నరేందర్, శివకుమార్, శేఖర్, రవీందర్‌లను సీఐ అభినందించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top