అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లిలో బుధవారం జరిగింది. గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్‌కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010లో వివాహం చేశారు.
వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతరు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది.
ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్‌కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మమత గోవింద్‌పల్లి బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడిక్కడే మృతి చెందింది.