ఎగ‘తాళి’! | wife and husband not living life long | Sakshi
Sakshi News home page

ఎగ‘తాళి’!

Aug 23 2014 4:01 AM | Updated on Nov 6 2018 8:28 PM

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. రెండు మనస్సులు ఒక్కటై కలకాలం కలిసి బతికే అనుబంధం.

 కామారెడ్డి: పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. రెండు మనస్సులు ఒక్కటై కలకాలం కలిసి బతికే అనుబంధం. అలాంటి పవిత్రబంధం కట్నదాహానికి, అనుమానపు పిశాచానికి బలవుతోంది. మద్యానికి బానిసై కొందరు, అదనపు కట్నం తెమ్మంటూ కొందరు, అనుమానాలు పెంచుకుని మరికొందరు... తమ బంధాన్ని ఎగతాలి చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

 కన్నవారిని వదిలి కట్టుకున్నోడే సర్వస్వం అని నమ్మిన పాపానికి భర్త చేతిలో హతమయ్యేవారు కొందరైతే, అత్తింటి ఆరళ్లను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరు. ఇటీవలి కాలంలో జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచం మొత్తం మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్న నేటి రోజుల్లో కట్టుకున్న ఆలిని బలితీసుకుంటున్న ఘటనలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. పెరిగిపోతున్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యల ఘటనలు ఒకవైపు, అత్యాచారాలు, చీత్కరింపులు, ఈవ్‌టీజింగ్, మోసాలు మరోవైపు మహిళల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళల హత్యలు, ఆత్మహత్యల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

కామారెడ్డి పట్టణంలోని శేర్‌గల్లీలో నివసించే గద్దె హేమలత (33)ను ఆమె భర్త విజయ్‌రెడ్డి ఈ నెల 10 ఇంట్లోనే గొంతునులిమి హత్య చేశాడు. ఆత్మహత్యగా కథ అల్లే ప్రయత్నం చేయగా మృతురాలి తల్లి ఫిర్యాదుతో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.
     
భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో ఆకిటి లత ఉరఫ్ సువర్ణ(34)ను ఆమె భర్త లింగారెడ్డి ఈ నెల 17న చీరతో గొంతుకు భిగించి హతమార్చాడు. ఇద్దరిమధ్య ఏర్పడ్డ విభేదాలతో భార్యను హత్యచేశాడు.  భర్తపై హత్యానేరం  కేసు నమోదైంది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.
     
దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఈ నెల 7న డబ్బుల కోసం భార్యను తన స్నేహితులకు అప్పగించి కాటేయమన్న ప్రబుద్ధున్ని, ఆ కామాంధుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కామాంధుల బారినుంచి తప్పించుకున్న మహిళ జరిగిన ఘటనను చెప్పడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాదారు.
     
నందిపేట మండలం తల్వేదలో ఈ నెల 18న  బరికె సుమలత(24) అనే వివాహిత భర్తతో గొడవ జరిగి ఉరివేసుకుని చనిపోయింది. ఆమె పిల్లలు అనాథలయ్యారు.
     
గాంధారి మండలం గండివేటకు చెందిన కల్పన (22) ఈ నెల 16న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ యేడాది ఫిబ్రవరిలో కల్పన వివాహం జరిగింది. ఆషాడ మాసం అని తల్లిగారింటికి వచ్చిన కల్పన ఆత్మహత్యకు పాల్పడింది.
     
భీంగల్ మండలం రహత్‌నగర్‌లో సునీత(23) అనే మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
 
బతకలేక...బతికించుకోలేక...
భర్తను భరించలేని కొందరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతుండ గా, మరికొందరు తమ పిల్లలను కూడా బలితీసుకుంటున్నారు. సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండానే చావును వెతుక్కుంటుండడంతో వారి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. భర్త అనుమానాలను భరించలేని కొందరు తమ పిల్లలను  బలిచేస్తున్నారు. కారణం ఏదైనా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
     
ఈ నెల 20న దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి హతమార్చింది. తనను అవమానిం చడం వల్లే భరించలేక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పేర్కొంది. పిల్లలను చంపిన ఆ తల్లిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.
     
ఈ నెల 20న డిచ్‌పల్లి మండలం వెస్లీనగర్‌లో ఓ మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో కూతురు మృతిచెందగా తల్లి చావుబతుకుల మధ్యన ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement