breaking news
Sacred bond
-
ఎగ‘తాళి’!
కామారెడ్డి: పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు.. రెండు మనస్సులు ఒక్కటై కలకాలం కలిసి బతికే అనుబంధం. అలాంటి పవిత్రబంధం కట్నదాహానికి, అనుమానపు పిశాచానికి బలవుతోంది. మద్యానికి బానిసై కొందరు, అదనపు కట్నం తెమ్మంటూ కొందరు, అనుమానాలు పెంచుకుని మరికొందరు... తమ బంధాన్ని ఎగతాలి చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కన్నవారిని వదిలి కట్టుకున్నోడే సర్వస్వం అని నమ్మిన పాపానికి భర్త చేతిలో హతమయ్యేవారు కొందరైతే, అత్తింటి ఆరళ్లను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరు. ఇటీవలి కాలంలో జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచం మొత్తం మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్న నేటి రోజుల్లో కట్టుకున్న ఆలిని బలితీసుకుంటున్న ఘటనలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. పెరిగిపోతున్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యల ఘటనలు ఒకవైపు, అత్యాచారాలు, చీత్కరింపులు, ఈవ్‌టీజింగ్, మోసాలు మరోవైపు మహిళల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళల హత్యలు, ఆత్మహత్యల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని శేర్గల్లీలో నివసించే గద్దె హేమలత (33)ను ఆమె భర్త విజయ్‌రెడ్డి ఈ నెల 10 ఇంట్లోనే గొంతునులిమి హత్య చేశాడు. ఆత్మహత్యగా కథ అల్లే ప్రయత్నం చేయగా మృతురాలి తల్లి ఫిర్యాదుతో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో ఆకిటి లత ఉరఫ్ సువర్ణ(34)ను ఆమె భర్త లింగారెడ్డి ఈ నెల 17న చీరతో గొంతుకు భిగించి హతమార్చాడు. ఇద్దరిమధ్య ఏర్పడ్డ విభేదాలతో భార్యను హత్యచేశాడు. భర్తపై హత్యానేరం కేసు నమోదైంది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఈ నెల 7న డబ్బుల కోసం భార్యను తన స్నేహితులకు అప్పగించి కాటేయమన్న ప్రబుద్ధున్ని, ఆ కామాంధుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కామాంధుల బారినుంచి తప్పించుకున్న మహిళ జరిగిన ఘటనను చెప్పడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాదారు. నందిపేట మండలం తల్వేదలో ఈ నెల 18న బరికె సుమలత(24) అనే వివాహిత భర్తతో గొడవ జరిగి ఉరివేసుకుని చనిపోయింది. ఆమె పిల్లలు అనాథలయ్యారు. గాంధారి మండలం గండివేటకు చెందిన కల్పన (22) ఈ నెల 16న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ యేడాది ఫిబ్రవరిలో కల్పన వివాహం జరిగింది. ఆషాడ మాసం అని తల్లిగారింటికి వచ్చిన కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. భీంగల్ మండలం రహత్‌నగర్‌లో సునీత(23) అనే మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. బతకలేక...బతికించుకోలేక... భర్తను భరించలేని కొందరు మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతుండ గా, మరికొందరు తమ పిల్లలను కూడా బలితీసుకుంటున్నారు. సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండానే చావును వెతుక్కుంటుండడంతో వారి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయి. భర్త అనుమానాలను భరించలేని కొందరు తమ పిల్లలను బలిచేస్తున్నారు. కారణం ఏదైనా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 20న దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి హతమార్చింది. తనను అవమానిం చడం వల్లే భరించలేక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పేర్కొంది. పిల్లలను చంపిన ఆ తల్లిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ నెల 20న డిచ్పల్లి మండలం వెస్లీనగర్లో ఓ మహిళ తన కూతురుకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో కూతురు మృతిచెందగా తల్లి చావుబతుకుల మధ్యన ఉంది. -
పచ్చందాలు..
‘పచ్చబొట్టూ చెరిగి పోదులే నా రాజా... పడుచు జంట చెదిరి పోదులే’ పవిత్రబంధం సినిమాలో నాగేశ్వరరావు, వాణిశ్రీ సూపర్ హిట్ సాంగ్. పడుచు జంట చెదిరిపోకుండా ఉంటుందో లేదో తెలియదు కానీ.. పచ్చ బొట్టు మాత్రం పర్మినెంట్‌గా ఉండిపోతుంది. ఒకప్పుడు పిల్లలెక్కడ తప్పిపోతారేమోనని ముందు జాగ్రత్త కోసం తల్లిదండ్రులు పచ్చబొట్టు వేయించేవారు. తర్వాతి కాలంలో మధుర ప్రేమకు చిలిపి గుర్తుగా.. ఒకరి పేరు పచ్చబొట్టుగా మారి మరొకరి తనువుపై కొలువయ్యేది. కాలాలు మారే సరికి ‘పచ్చ’బొట్టు కాస్తా మల్టీకలర్స్ను కలిపేసుకుని టాటూగా మారిపోయింది. మొదట్లో సెలబ్రిటీల దేహంపై సాక్షాత్కరించిన టాటూలు కొద్ది రోజుల్లోనే ఈతరం యూత్‌కు అతుక్కుపోయాయి. ఒకప్పుడు ఏ సంతకో, తిరునాళ్లకో వెళ్తే గానీ పచ్చబొట్టు వేయించుకునే అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు టాటూస్ కోసం స్టూడియోలే వెలిశాయి. దేవుళ్లు, దెయ్యాలు, జంతువులు, పక్షులు, డ్రాగన్స్.. చివరకు కీటకాలు ఇలా కావేవీ టాటూకు అనర్హం అన్నంతగా మారిపోయింది. కొందరు చేతులపై, మెడపై.. ఇంకొందరు నడుముపై, మరికొందరు ఒళ్లంతా టాటూలకు అర్పించేస్తున్నారు. టాటూ వేయించుకోవాలనుకున్న ముందు రోజు నుంచే ఆల్కహాల్, డ్రగ్స్‌లాంటివి తీసుకోకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు టాటూ వేయించుకోకూడదు. టాటూ వేయడం కోసం వాడేందుకు కొత్త సూదులనే వాడాలి. టాటూగన్, ఇతర సామగ్రిని పూర్తిగా శుభ్రపరిచే యంత్రాలు స్టూడియోలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. కలర్‌తో పాటు టాటూ వేయడానికి ఉపయోగించే ప్రతి అంశాన్నీ పరిశీలించాలి. టాటూ వేసిన తరువాత సూచించే సలహాలను తప్పనిసరిగా పాటించాలి. అన్నింటినీ మించి మీ శరీరం టాటూస్‌కు సరైందా లేదా పరీక్షించుకోవాలి. సమ్‌థింగ్ స్పెషల్ చర్మపు పొరల్లోకి సిరాను ఇంజెక్ట్ చేసి స్కిన్ కలర్ మార్చి అందమైన డిజైన్లుగా వేయించుకోవడమే టాటూ. తామేంటో చెప్పుకోవడానికి కొందరు టాటూను ఆశ్రయిస్తే.. తమ ప్రత్యేకత చాటుకోవడానికి ఒంటిపై టాటూకు చోటిస్తున్నారు ఇంకొందరు. కొందరు పెంపుడు జంతువులను అలంకరించడానికి కూడా టాటూలను వాడుకుంటున్నారు. షోలకు తీసుకెళ్లే జంతువులు, గుర్రాలకు గుర్తుల కోసం టాటూ వేయిస్తున్నారు. కాస్మొటిక్ టాటూ.. ఈ రకం టాటూ పర్మనెంట్ మేకప్‌గా ఉండిపోతుంది. కళ్లు కలువ రేకుల్లా కనిపించడం కోసం ఐ లైనింగ్.., మంచి ఛాయ కోసం ముఖానికి, అధరాలు అదరహో అనిపించడానికి పెదవులకు కూడా టాటూస్ వేయించుకుంటున్నారు. ముఖంపై మచ్చలు పోగొట్టడానికి టాటూస్‌తో రంగులద్దించుకుంటున్నారు. మెడికల్ టాటూస్ శ రీరంలో ఉన్న వ్యాధిని తెలియజేసేలా వేసేదే మెడికల్ టాటూ. దీర్ఘకాలిక వ్యాధి, అలర్జీతో బాధపడే వ్యక్తి ఏ క్షణంలోనైనా ఆపదలో చిక్కుకోవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తి రక్తంలో చక్కెర శాతం తగ్గినా పెరిగినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లను గుర్తించి వెంటనే చికిత్స అందించేందుకు ఇలాంటి టాటూస్ ఉపయోగిస్తున్నారు. ప్రొఫెషనల్ అయితే బెస్ట్ టాటూ డిజైన్ ఎంత అందంగా వేయించుకుంటున్నామనే దానికంటే ఎలాంటి స్టూడియో ఎంపిక చేసుకున్నామన్నది చాలా ముఖ్యం. టాటూ వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పరిశుభ్రమైన సూదులు ఉపయోగించకపోవడం వల్ల ప్రమాదం తలెత్తవచ్చు. కలుషితమైన సిరాలో రోగకారక శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఉంటే, కళ్లు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే నాణ్యత, సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తే వీటిని తగ్గించొచ్చు. పచ్చబొట్టు వేసే సమయంలో గన్ను పరిశుభ్రమైన ప్లేస్లోనే ఉంచుతున్నారో, లేదో కచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టు లెసైన్స్ విషయాన్ని కూడా ఆరా తీయాల్సిందే. రెలిజియస్ టాటూ నచ్చిన దైవాన్ని తనలో భాగం చేసుకోవాలని భావిస్తున్న యువతరం రెలిజియస్ సింబల్స్‌ను పచ్చ పొడిపించుకుంటున్నారు. వినాయకుడు, సాయిబాబా, శివుడు వంటి దేవుళ్ల బొమ్మలను టాటూగా వేయించుకుంటున్నారు. మ్యూజికల్ నోట్స్, చైనా అక్షరాలు వంటి వెరైటీ టాటూస్‌ను కూడా ప్రిఫర్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త పేర్లు టాటూగా వేయించుకునే వాళ్లు కాస్త జాగ్రత్త. రణబీర్‌కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగినప్పుడు దీపికా పదుకొనె ‘ఆర్కే’ అనే పచ్చబొట్టు వేయించుకుంది. ఆ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. అయినా ఏం లాభం ఒంటిపై ఉన్న రణబీర్‌ను తీసేయలేక నానా తంటాలు పడుతోంది. ఇక నయనతార గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రభుదేవాతో కలసి స్టెప్పులు వేసినపుడు ‘ప్రభు’ అని పొడిపించుకుంది. ప్రేమను బ్రేకప్ చేసుకున్నా.. ఒంటిపై ఉన్న ‘ప్రభు’ను మాత్రం దూరం చేసుకోలేకపోతోంది. షూటింగ్ టైంలో దాన్ని కవర్ చేసుకోలేక తెగ ఇబ్బంది పడుతోంది. - శిరీష చల్లపల్లి