షాద్‌నగర్‌ బాద్‌షా ఎవరో..! | Who is Going to Win in Shadnagar | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌ బాద్‌షా ఎవరో..!

Dec 5 2018 11:07 AM | Updated on Dec 5 2018 11:14 AM

Who is Going to Win in Shadnagar - Sakshi

షాద్‌నగర్‌ (ప్రతీకాత్మక చిత్రం)

షాద్‌నగర్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ముఖ్యంగా నలుగురి మధ్యే గట్టి పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, మహాకూటమి(కాంగ్రెస్‌), బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోటీ ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్యయాదవ్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలే అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అండతో కాంగ్రెస్‌ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీర్లపల్లి శంకర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి అనంతరం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఏనుగు గుర్తుతో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన శ్రీవర్ధన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: 17

ప్రధాన అభ్యర్థులు నలుగురు 
ఎల్గనమోని అంజయ్యయాదవ్‌  (టీఆర్‌ఎస్‌)
చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి                (కాంగ్రెస్‌
నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి                     (బీజేపీ)
వీర్లపల్లి శంకర్‌                       (బీఎస్పీ

సాక్షి, షాద్‌నగర్‌: తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న ఎల్గనమోని అంజయ్య యాదవ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియచేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా రు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు కృషి చేస్తాయని అంజయ్య యాదవ్‌ చెబుతున్నారు. నియోజకవర్గంలో వరుసగా ఒక్క శంకర్‌రావు తప్పా ఇతరులెవరు వరుసగా విజయం సాధించసాధించలేదు. ఈసారి ఆ రికార్డును తాను సమం చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి (కాంగ్రెస్‌) అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, అధికారంలోకి వస్తే హమీలన్నీ నెరవేరుస్తామని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు.

కేంద్ర సాయంతో అభివృద్ధి చేస్తాం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నుంచి బరిలో దిగిన నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయంతో కనీవిని ఎరగని రీతితో షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రజలకు శాశ్వత తాగు, సాగు నీరు అందించడానికి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని శ్రీవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. గత ఎన్నికల్లో తృతీయ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇస్తూ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పరిపూర్ణనందస్వామి పర్యటనలతో కేడర్‌లో జోష్‌ పెరిగింది.

చాపకింది నీరులా బీఎస్పీ.. 
టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన వీర్లపల్లి శంకర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి బీఎస్పీ నుంచి బీఫామ్‌ దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాలను కలుపుపోతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శంకర్‌ టీఆర్‌ఎస్‌లో ఉండగానే తనకంటూ ఓ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చివరకు పార్టీ టికెట్‌ నిరాకరించడంతో బీఎస్పీ నుంచి బరిలో దిగారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అధికార పార్టీకి చెందిన ఓట్లు చీలిపోయే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement