కత్తిగాటు లేకుండా..రక్తపు చుక్క కారకుండా 

Weight loss with Endoscopic sleeve gastroplasty Surgery in Care Hospital - Sakshi

     ‘ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ’చికిత్సతో బరువు తగ్గింపు 

     తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన కేర్‌ ఆస్పత్రి

సాక్షి, హైదరాబాద్‌: పొట్టపై కత్తిగాటు లేకుండా... రక్తం చిందించకుండా.. కనీసం నొప్పి కూడా తెలియకుండా బరువు తగ్గించే ప్రక్రియను కేర్‌ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కొవ్వు కరిగింపు చర్యలో భాగంగా బెరియాట్రిక్‌ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్‌కు బదులు.. తాజాగా రోబోటిక్‌ ఎండోస్కోపిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్‌ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తొలిరోజే ముగ్గురు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయడం విశేషం. ఈ మేరకు శుక్రవారం హోటల్‌ గోల్కొండలో ఈ అంశంపై ప్రముఖ రోబోటిక్‌ బెరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మోహిత్‌ బండారి, కేర్‌ ఫెసిలిటీ చీఫ్‌ ఆపరేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రియాజ్‌ ఖాన్‌లు విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు.  

ఆ రెండు చికిత్సలకు భిన్నంగా.. 
బరువు తగ్గించే చికిత్సలు రెండు రకాలు. ఒకటి లైఫోసక్షన్‌. దీనిలో సూదుల ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును బయటికి లాగేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడినది. రెండోది బెరియాట్రిక్‌ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో పొట్టపై మూడు నుంచి నాలుగు చిన్నపాటి రంధ్రాలు చేసి(కీ– హోల్‌)బెలూన్‌ తో పెద్దపేగు సైజును తగ్గించే పద్ధతి. ఈ రెండు చికిత్సలూ ప్రమాదకరమైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స అవసరం లేని ‘ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రో ప్లా స్టీ’అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌ల్లో మాత్రమే ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బెరియాట్రిక్, లైఫో సక్షన్‌కు భిన్నంగా ఈ ఎండోస్కోపిక్‌ పద్ధతి లో చేస్తారు. అత్యాధునిక కెమెరాతో తయారు చేసిన రోబోటిక్‌ ఎండోస్కోపిని నోటి ద్వారా పొట్టలోకి పంపించి, పెద్ద పేగు సైజు ను తగ్గించి కుట్లు వేసే ప్రక్రియే ఈ చికిత్స. పొట్ట సైజును 1/4 శాతం తగ్గిస్తారు. తక్కువ ఆహారానికే కడుపు నిండిపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోలేక పోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంది. ఇలా 25 నుంచి 30 కేజీల వరకు తగ్గుతారు. ఈ తరహా చికిత్సలో కత్తిగాటు లేకపోవడమే కా దు..కనీసం నొప్పి కూడా తెలియదు. ఇన్‌ఫెక్షన్‌ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గింపునకిది శాశ్వత పరిష్కారంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

తొలి రోబోటిక్‌ బెరియాట్రిక్‌ సర్జన్‌ ఆయనే
దేశంలో రోబోటిక్‌ బెరియాట్రిక్‌ సర్జరీలు నిర్వహించిన తొలి వైద్యుడు డాక్టర్‌ మోహిత్‌ బండారే. ఆయన ఇప్పటి వరకు 11 వేలకు పైగా కొవ్వు కరిగింపు చికిత్సలు చేశారు. కేవలం 11 గంటల్లో 25 చికిత్సలు చేసి, లిమ్కాబుక్‌లో చోటు సంపాదించారు. 2012లో 350 కేజీల బరువు ఉన్న ఆసియా మహిళకు ఆయన చికిత్స చేశారు. 2013లో ఆరేళ్ల బాలునికి బెరియాట్రిక్‌ నిర్వహించి ఖ్యాతి గాంచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top