16న అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు 

Weather Forecast Southwest Monsoon Enters Andaman On May 16 - Sakshi

రాష్ట్రానికి జూన్‌ 8న రాక!

సాక్షి, హైదరాబాద్‌: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 16న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెల 18న అండమాన్‌లోకి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంటే ఈసారి రెండ్రోజులు ముందుగానే అండమాన్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు జూన్‌ 8న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కేరళకు, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణశాఖ ఒకట్రెండు రోజుల్లో బులెటిన్‌ విడుదల చేసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.  
13న అల్పపీడనం...: ఇదిలావుంటే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయిల ఎత్తుకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 
(చదవండి: వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top