వైరస్‌పై యుద్ధం.. ఇలా చేద్దాం

Central Home Department Issued Guidelines For To Take Care From Coronavirus - Sakshi

జాగ్రత్తలు పాటించండి.. రోగనిరోధకశక్తి పెంచుకోండి

కరోనా వైరస్‌పై విజయానికి ప్రాథమిక సూత్రాలివే..

అవసరమైతేనే బయటికి.. పరిశుభ్రత తప్పనిసరి

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటం చేయాలంటే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మందు మరేదీ లేదు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని, జనం సమూహాలుగా ఏర్పడరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో అత్యవసర పనులపై బయటకు వచ్చి.. తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంలో, సరుకుల కొనుగోలు, ఇతర సమయాల్లో ప్రజలు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సలహా సూచనలను కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టంచేసింది.

పోషకాహారం.. యోగాసనాలు
కరోనా వైరస్‌ కట్టడికి ఇంతవరకు వ్యాక్సిన్‌ లేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో చికిత్స అందించి రోగం తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ సరైన మందులు అందుబాటులో లేవు. అందువల్ల సరైన ఆహారం తీసుకుంటూ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కరోనాను జయించవచ్చు. రోజూ కనీసం 30నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి ఆచరించాలి.

మాస్క్, శానిటైజర్, భౌతికదూరం..
► ఇంటి బయటకు వెళ్లేముందు ట్రిపుల్‌ లేయర్‌ లేదా ఎన్‌–95 లేదా సర్జికల్‌ మాస్క్‌ తప్పక ధరించాలి. కాలికి ప్లాస్టిక్‌ స్లిప్పర్లు వేసుకోవాలి.
► సరుకుల కోసం సంచి లేదా ప్లాస్టిక్‌ బాస్కెట్‌ తీసుకెళ్లాలి. మార్కెట్లో/బయట వివిధ ఉపరితలాలను తాకకుండా జాగ్రత్త పడాలి.
► దుకాణాదారు లేదా ఇతరులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. మార్కెట్‌కు వెళ్లేవారు వెంట హ్యాండ్‌ శానిటైజర్‌ను తీసుకెళ్లాలి.
► అత్యవసరమైతేనే మార్కెట్‌కు వెళ్లాలి. వారంలో రెండుసార్లకు మించి వెళ్లకపోవడం మంచిది.
► ఏటీఎంలో నగదు డ్రా చేయాలంటే ముందు మిషన్‌ కీబోర్డును శానిటైజ్‌ చేయాలి. కార్డు వినియోగించాక కూడా శానిటైజర్‌తో శుభ్రంచేయాలి.
► ఇంట్లో ఉన్నప్పుడు కరోనా లక్షణాలు లేని వారు మాస్కు వాడనవసరం లేదు.

లిఫ్ట్‌ వద్దు.. మెట్లే ముద్దు
► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర భవనాల్లో లిఫ్ట్‌ వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువ మంది దీన్ని విని యోగించడం, తక్కువ విస్తీర్ణం గల వీటిలో భౌతికదూరం పాటించడం కష్టం కాబట్టి.. మెట్లు వాడాలి. ూ ► వాడటం తప్పనిసరైతే పేపర్‌ ముక్కల ద్వారా బటన్లు నొక్కి.. ఆపై వాటిని డస్ట్‌బిన్‌ లో పారేయాలి. ూ ఇంట్లోకి వెళ్లే ముందు ఎక్కడా, ఎలాంటి ఉపరితలాలను తాకకూడదు. నేరుగా బాత్రూమ్‌కు వెళ్లి బట్టలు వదిలేసి స్నానం చేయాలి (ఎక్కువ మందిని తక్కువ దూ రంతో తాకినట్టు భావిస్తే). లేదంటే చేతులు, ము ఖాన్ని సబ్బు/హ్యాండ్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. 
► చెప్పులను కూడా శుభ్రం చేసుకోవాలి. 
► ఇంట్లోకి బయటి వ్యక్తులను అనుమతించేటప్పుడు వారి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి. సమస్య లేకుంటే, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని లోనికి అనుమతించాలి.

ఇంటి పరిశుభ్రత ఇలా...
► ఇళ్లను రోజూ డిటర్జెంట్‌ ఉన్న ద్రావణంతో శుభ్రం చేయాలి. ముఖద్వారంతో పాటు కాలింగ్‌బెల్‌ను క్రమం తప్పకుండా శానిటైజ్‌ చేయాలి.
► సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో చేతులను 20 సెకన్లపాటు రుద్ది కడుక్కోవాలి. 
► మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పాలప్యాకెట్లను ఉప్పు/బేకింగ్‌ సోడాలో 2శాతం డిటర్జెంట్‌ ద్రావణంతో కలిపి కడిగి శుభ్రం చేయాలి. 
► ఇంట్లోకి తెచ్చిన ఇతర వస్తువులను.. 72 గంటల అనంతరం వినియోగించడం మంచిది. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయొద్దు.

వైరస్‌ ఏ ఉపరితలంపై ఎంతకాలం ఉంటుందంటే.. 
అల్యూమినియం: 2–8 గంటలు
చెక్క: 4 రోజులు
ప్లాస్టిక్‌: 2–5 రోజులు
మెటల్‌: 5 రోజులు
సెరామిక్‌: 5 రోజులు
స్టీల్‌: 2–28 రోజులు
గ్లాస్‌: 4–5 రోజులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top