భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య సిడ్నీ వేదికగా రేపు (అక్డోబర్ 25) వన్డే మ్యాచ్ జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ ఇది. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకుంది. ఆ జట్టు తొలి రెండు వన్డేల్లో భారత్పై ఏకపక్ష విజయాలు సాధించింది. రేపు జరుగబోయే మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.
కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేకు వరుణుడు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో వారికి గుడ్ న్యూస్ అందింది.
Accuweather సమాచారం ప్రకారం, సిడ్నీలో రేపు వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ పూర్తిస్థాయిలో సజావుగా సాగుతుంది. ఉష్ణోగ్రతలు సుమారు 16°C నుంచి 23°C మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు భారీ స్థాయిలో అభిమానులు హాజరుకానున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ మధ్యాహ్నమే సిడ్నీ మైదానం బయట సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టింది. అప్రాధాన్యమైన మ్యాచ్ అయినప్పటికీ.. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపు వీకెండ్ కావడంతో ఈ మ్యాచ్ను అదనపు ఆదరణ లభించనుంది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా పరంగా రేపటి మ్యాచ్ అప్రాధాన్యమైనప్పటికీ టీమిండియాకు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్, రేపటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలని భావిస్తుంది. ఒకవేళ రేపటి మ్యాచ్లో కూడా భారత్ ఓడితే వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్ పరాభవాన్ని ఎదుర్కొంటుంది.
చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్
రేపటి మ్యాచ్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 జట్టు ఇదివరకే ఆసీస్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. భారత వన్డే జట్టులో కొందరు మాత్రమే టీ20 జట్టులో ఉన్నారు. సీనియర్లు విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ తర్వాత భారత్కు బయల్దేరిపోతారు.


