ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు (Team India) క్లీన్ స్వీప్ భయం పట్టుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఇదివరకే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. రేపు (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగబోయే మూడో వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
చెత్త రికార్డు
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గత రికార్డులు కలవరపెడుతున్నాయి. సిడ్నీలో భారత జట్టుకు చాలా చెత్త రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన 19 వన్డేల్లో భారత్ కేవలం రెండింట మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
ప్రస్తుతం ఈ రికార్డే భారత క్రికెట్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవేళ సిడ్నీలో చరిత్ర రిపీటై భారత్ 17వ సారి ఓడితే ఆస్ట్రేలియా చేతిలో తొలి వైట్‌వాష్ (వన్డేల్లో) ఎదురవుతుంది.
రోహిత్‌కు అనుకూలం
సిడ్నీ మైదానంలో టీమిండియాకు వ్యతిరేకంగా ఉన్న ట్రాక్ రికార్డు, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ విషయానికి వచ్చే సరికి అనుకూలంగా ఉంది. హిట్ మ్యాన్ గత నాలుగు వన్డేల్లో ఇక్కడ సెంచరీ, 2 అర్ద సెంచరీలు చేశాడు. చివరిగా (2019) ఆడిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (133) బాదాడు.
సిడ్నీలో గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ స్కోర్లు..
133 (129)
99 (108)
34 (48)
66 (87)
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు తొలి రెండు వన్డేల్లో పరాజయాలపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. సిడ్నీ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.
విరాట్ వైఫల్యాలు
ఏడు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు వన్డేల్లో డకౌటై అభిమానుల తీవ్ర నిరాశకు గురి చేశాడు. తొలి వన్డేలో 8 బంతులు, రెండో వన్డేలో 4 బంతులు ఆడిన కోహ్లి ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.
మరో పక్క కోహ్లితో పాటే ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మ మాత్రం తొలి వన్డేలో (8) విఫలమైనా, రెండో వన్డేలో అత్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించనప్పుడు చాలా బాధ్యతగా ఆడి అర్ద సెంచరీ (73) చేశాడు.
రోహిత్ నిలకడగా ఆడటంతోనే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264) చేయగలిగింది. అయితే బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడంతో భారత్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
చదవండి: భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్?


