భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్‌? | Who is Jack Edwards Uncapped Player called up for AUS vs IND 3rd ODI | Sakshi
Sakshi News home page

భారత్‌తో మూడో వన్డే.. ఆసీస్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు చోటు.. ఎవరీ ఆల్‌రౌండర్‌?

Oct 24 2025 3:50 PM | Updated on Oct 24 2025 4:28 PM

Who is Jack Edwards Uncapped Player called up for AUS vs IND 3rd ODI

స్వదేశంలో ఆస్ట్రేలియా సత్తా చాటింది. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 (IND vs AUS 2025 ODIs)తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టులో కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్‌ జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ (Jack Edwards)కు జట్టులో చోటిచ్చింది. దేశీ క్రికెట్లో అదరగొడుతూ సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఈ న్యూ సౌత్‌వేల్స్‌ ఆటగాడిని తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. 

మార్నస్‌ లబుషేన్‌ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంది. మరోవైపు.. నామమాత్రపు ఆఖరి వన్డేలో మ్యాట్‌ కుహ్నెమన్‌కు కూడా ఆసీస్‌ యాజమాన్యం జట్టులో స్థానం కల్పించింది.

ఇంతకీ ఎవరీ జాక్‌ ఎడ్‌వర్డ్స్‌?
అండర్‌-19 వరల్డ్‌కప్‌-2018లో బ్యాట్‌, బంతితో మెరిసిన జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ ఆస్ట్రేలియా రన్నరప్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 216 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌ వన్డే కప్‌ చరిత్రలోనే..
ఈ క్రమంలో ఫామ్‌ను కొనసాగిస్తూ ఎడ్‌వర్డ్స్‌ ఆస్ట్రేలియా డొమెస్టిక్‌ వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు. ఆసీస్‌ వన్డే కప్‌ చరిత్రలో అత్యంత పిన్న వయసు (18 ఏళ్లు)లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ రికార్డు సాధించాడు.

ఏడేళ్ల క్రితం క్వీన్స్‌లాండ్‌పై ఈ న్యూ సౌత్‌వేల్స్‌ బ్యాటర్‌ 112 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అప్పటికి ఎడ్‌వర్డ్స్‌ వయసు 18 ఏళ్ల 165 రోజులు మాత్రమే కావడం గమనార్హం.

ఇండియా- ఎ జట్టుతో వన్డేలలో అదరగొట్టి
ఇక ఇటీవల ఇండియా- ఎ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లోనూ ఎడ్‌వర్డ్స్‌ అదరగొట్టాడు. తొలి వన్డే మిస్సయినప్పటికీ.. రెండో వన్డేలో మాత్రం అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి స్టార్ల వికెట్లు కూల్చాడు. ఓవరాల్‌గా 4/56 గణాంకాలతో అదరగొట్టాడు.

అంతేకాదు.. 75 బంతుల్లోనే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా బౌలింగ్‌లోనూ చితక్కొట్టి తనను తాను నిరూపించుకున్నాడు.

కాగా ఎడ్‌వర్డ్స్‌ అన్న మిక్కీ ఎడ్‌వర్డ్స్‌ కూడా క్రికెటరే. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ దేశీ క్రికెట్‌ ఆడాడు. ఇక 2018లో బిగ్‌ బాష్‌ లీగ్‌లో అడుగుపెట్టిన జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ నాటి నుంచి పొట్టి ఫార్మాట్లో తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉన్నాడు.

సిడ్నీ సిక్సర్స్‌ 2019-20, 2020-21 సీజన్లలో టైటిల్‌ గెలవడంలో జాక్‌ తన వంతు పాత్ర పోషించాడు. ఇక వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ తరఫున గత రెండు ఎడిషన్లలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచ్‌లలో 25 ఏళ్ల జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ 700 పరుగులు చేయడంతో పాటు 33 వికెట్లు కూల్చడం విశేషం.

భారత్‌తో మూడో వన్డేకు ఆస్ట్రేలియా జట్టు: 
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్‌వర్డ్స్‌, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ ఓవెన్, జోష్‌ ఫిలిప్‌ (వికెట్‌ కీపర్‌), మ్యాట్‌ రెన్షా, మాథ్యూ షార్ట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.

చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement