భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు చేరింది. వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆమె.. వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రీలర్‌తో ప్రపంచ రికార్డును షేర్ చేసుకుంది. లిండ్సే, ప్రతిక ఇద్దరూ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండుకుపోయే ఇలాంటి రికార్డులలో ప్రతిక చేరడం గమనార్హం.
వన్డేల్లో తొలి 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో ప్రతిక, లిండ్సే తర్వాత ముగ్గురూ ఆస్ట్రేలియన్లే ఉన్నారు. నికోల్ బోల్టన్, మెగ్ లాన్నింగ్ తలో 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. బెలిండా క్లార్క్ 27 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుంది.
25 ఏళ్ల ప్రతిక గతేడాది (2024) డిసెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. స్వల్ప కెరీర్‌లో తాజా ఇన్నింగ్స్ (న్యూజిలాండ్‌పై) సహా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. ఢిల్లీకి చెందిన ప్రతిక పదేళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పలు దశలను దాటుకుంటూ ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ప్రతిక అద్భుతమైన టచ్‌లో ఉంది. 6 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 51.33 సగటున 308 పరుగులు చేసి టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుంది. ఓవరాల్ కెరీర్‌లో 23 వన్డేలు ఆడిన ప్రతిక 2 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 50.45 సగటున 1110 పరుగులు చేసింది.
నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్య పోరాటం ప్రదర్శించింది. 44 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది. బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్


