రోహిత్‌ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్‌ చేశారు? | He must be feeling the guilt inside: India Ex batter on Gill leading Rohit Sharma | Sakshi
Sakshi News home page

రోహిత్‌ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్‌ చేశారు?

Oct 24 2025 1:19 PM | Updated on Oct 24 2025 2:19 PM

He must be feeling the guilt inside: India Ex batter on Gill leading Rohit Sharma

వన్డే కెప్టెన్‌గా టీమిండియా పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌ (IND vs AUS ODIS 2025)ను భారత్‌ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.

ఈ నేపథ్యంలో వన్డే సారథిగా తొలి సిరీస్‌లోనే వరుసగా రెండు వన్డేలు ఓడిన ఆరో భారత కెప్టెన్‌గా గిల్‌ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్‌ వాడేకర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, క్రిస్‌ శ్రీకాంత్‌, మొహమ్మద్‌ అజారుద్దీన్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు.

రోహిత్‌ శర్మపై వేటు వేసి
కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (వన్డే)-2025 అందించిన రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి మరీ.. బీసీసీఐ గిల్‌కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడిలైడ్‌లో రెండో వన్డేలో గిల్‌ సేన ఓటమి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ తనదైన శైలిలో స్పందించాడు.

రోహిత్‌ భయ్యా ఏ తప్పూ చేయలేదు..
‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్‌ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్‌ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్‌ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్‌ ఆడాడు. కెప్టెన్‌గా రోహిత్‌ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్‌కు బాగా తెలుసు.

అయినా సరే.. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్‌ రూమ్‌లో నిద్రకు ఉపక్రమించే ముందు బహుశా గిల్‌ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్‌ భాయ్‌ ఎలాంటి తప్పూ చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?

నన్నెందుకు కెప్టెన్‌ చేశారు?
నన్ను సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారైనా రోహిత్‌ భాయ్‌ గురించి ఆలోచించారా? ఆయన రెండు ట్రోఫీలు గెలిచాడు. అయినా సరే కెప్టెన్‌గా వేటు వేశారు. కొత్త కెప్టెన్‌గా నన్ను ఎంపిక చేశారు’ అనే గిల్ట్‌తో సతమతమవుతూ ఉంటాడు’’ అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా సిరీస్‌ ఓటమిపై స్పందిస్తూ..

ఆ విషయం గుర్తే లేదు 
‘‘వరుస సిరీస్‌లు, ప్రయాణ బడలిక. రోహిత్‌, కోహ్లి వంటి దిగ్గజాలను లీడ్‌ చేయడం వంటికి గిల్‌కు పెద్ద సవాలు. వన్డే కెప్టెన్‌గా గిల్‌ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాడు. జట్టు మార్పు చెందే ప్రక్రియలో ఇలాంటివి సహజమే.

గిల్‌ కాస్త ఒత్తిడికి లోనై ఉంటాడు. అతడి సారథ్యంలో మనం వన్డే సిరీస్‌ కోల్పోయాం. చివరగా ఎప్పుడు ఇది జరిగిందో కూడా ఎవరికీ గుర్తులేదు. గిల్‌ కెప్టెన్సీలో ఆరంభంలోనే ఇది జరిగింది’’ అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్‌ రాత.. టీమిండియాకు బూస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement