చరిత్ర సృష్టించిన స్మృతి మంధన | Smriti Mandhana equals Australia’s Meg Lanning record for the most hundreds in women’s international cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్మృతి మంధన

Oct 24 2025 3:42 PM | Updated on Oct 24 2025 3:59 PM

Smriti Mandhana equals Australia’s Meg Lanning record for the most hundreds in women’s international cricket

భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లాన్నింగ్‌తో (Meg Lanning) వరల్డ్‌ రికార్డును షేర్‌ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్‌ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్‌ 23) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్‌ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్‌లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో 1)
మెగ్‌ లాన్నింగ్‌-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)
సూజీ బేట్స్‌-13 (వన్డేల్లో 13)
ట్యామీ బేమౌంట్‌-12 (వన్డేల్లో 12)
నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌-10 (వన్డేల్లో 10)

పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ అనిపించుకుంది.

న్యూజిలాండ్‌పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా తజ్మిన్‌ బ్రిట్స్‌తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్‌, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.

ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్‌ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్‌ లాన్నింగ్‌కు (15) మరింత చేరువయ్యింది.

న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగెజ్‌ (76 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది.

అనంతరం భారీ లక్ష​ ఛేదనలో న్యూజిలాండ్‌ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో బ్రూక్‌ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్‌) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌ బెర్త్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement