నవంబర్ 28 నుంచి భారత్‌లో జరగాల్సిన పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌కప్ (Men's Hockey Junior World Cup 2025) నుంచి పాకిస్తాన్ తప్పుకొంది. భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF) అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన హాకీ టోర్నీ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్‌కు ఇది రెండోసారి. ఆగస్ట్‌లో జరగాల్సిన పురుషుల ఆసియా కప్ నుంచి కూడా పాక్ ఇదే కారణంగా వైదొలిగింది. అప్పుడు పాక్ స్థానాన్ని బంగ్లాదేశ్‌తో భర్తీ చేసి టోర్నీని కొనసాగించారు.
తాజాగా జూనియర్ ప్రపంచకప్ నుంచి కూడా పాక్ తప్పుకోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రత్యామ్నాయ జట్టును వెతికే పనిలో పడింది. టోర్నీ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉండటంతో త్వరలో ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ 2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 మధ్యలో భారత్‌లోని చెన్నై, మధురై నగరాల్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో పాక్ భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్-బిలో ఉంది.
ప్రపంచకప్ నుంచి తప్పుకున్న అనంతరం PHF కార్యదర్శి రానా ముజాహిద్ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో మా జట్టు ఆడడం సురక్షితం కాదని భావిస్తున్నాం. ఇటీవల UAEలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత ఆటగాళ్లు మా ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ట్రోఫీ అందుకోవడాన్ని కూడా తిరస్కరించారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో మా జట్టును పంపడం సరికాదు” అని వ్యాఖ్యానించాడు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న పాక్ ఉగ్రమూకలు పహల్గాంలో దాడులకు తెగబడి పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరిట పాక్‌కు తగిన గుణపాఠం చెప్పింది. ఆతర్వాత భారత్-పాక్‌ల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి.


