ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. అడిలైడ్ మ్యాచ్‌లో భారత జట్టు యాజమాన్యం అనుసరించిన వ్యూహాన్ని తప్పుబట్టిన అశూ.. తెలివి తక్కువ నిర్ణయం కారణంగా సిరీస్ కోల్పోయామంటూ ఘాటు విమర్శలు చేశాడు.
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది టీమిండియా. తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా పెర్త్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. గురువారం నాటి రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా 0-2తో సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది.
బెంచ్‌కే పరిమితం
అయితే, ఈ రెండు వన్డేల్లోనూ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను బెంచ్‌కే పరిమితం చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. వికెట్ల తీయగల సత్తా ఉన్నా అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
జంపా అదుర్స్
ముఖ్యంగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (Adam Zampa) నాలుగు వికెట్లతో రాణించి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించడం.. కుల్దీప్ లేనిలోటును మరింత ఎత్తి చూపింది. ఆతిథ్య జట్టు తమ స్పిన్నర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే.. టీమిండియా మాత్రం వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వచ్చాయి.
వికెట్లు తీసే బౌలర్లు కావాలి
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అడిలైడ్ వన్డేలో టీమిండియా బౌలింగ్ అటాక్ అత్యంత సాధారణంగా అనిపించింది. అసలు వికెట్ తీయాలని ఎవరూ ప్రయత్నించినట్లుగా అనిపించనేలేదు. పరుగులు చేయడం కంటే కూడా వికెట్లు పడగొట్టగలిగే బౌలర్లను ఎంపిక చేసుకోవాలి.
మంచి కెప్టెన్లు, నాయకులు ఎలా ఆలోచిస్తారంటే
ఆడం జంపా నాలుగు వికెట్లు ఎలా తీశాడో చూశారా?.. అతడు బంతిని తిప్పేశాడు. ప్రతిసారీ మన డ్రెసింగ్‌రూమ్ దృష్టికోణం గురించే ఆలోచించవద్దు. మంచి కెప్టెన్లు, నాయకులు.. ఎల్లప్పుడూ ప్రత్యర్థి జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో ముందే ఊహించి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ మ్యాచ్‌లో ఆడిన కూపర్ కన్నోలి ఇది వరకు అసలు కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కొన్నాడా? లేదు కదా!.. మరి మాథ్యూ షార్ట్.. అలెక్స్ క్యారీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడు. మిచెల్ ఓవెన్ కూడా ఇంత వరకు కుల్దీప్‌ను ఎదుర్కొనేలేదు.
తెలివి తక్కువ నిర్ణయం
ఆస్ట్రేలియా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్‌లో చాలా మందికి కుల్దీప్ బౌలింగ్‌లో ఆడిన అనుభవమే లేదు. కాబట్టి అతడిని ఆడిస్తే.. ప్రత్యర్థి జట్టులోని ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడేవాడు. కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివిగల నిర్ణయం అయితే కానేకాదు’’ అని అశ్విన్.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.
చదవండి: రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?


