తాజాగా జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఇన్నింగ్స్ 73 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్‌తో (Slow Over) బౌలింగ్ చేసినందుకు ఐసీసీ ఆఫ్ఘన్ జట్టుకు జరిమానా విధించింది.
ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత పెట్టింది. నిర్దేశిత సమయంలోపు ఆఫ్ఘన్ బౌలర్లు ఐదు ఓవర్లు తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఫైన్ ఇంపోజ్ చేశాడు. విచారణలో ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తప్పు ఒప్పుకోవడంతో ఎలాంటి చర్యలు లేకుండా జరిమానాతో సరిపెట్టారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్-జింబాబ్వే జట్ల మధ్య అక్టోబర్ 20న మొదలైన టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ఆ జట్టు బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు.
బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్‌లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్‌లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 127, రెండో ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది.
కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. అక్టోబర్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (అక్టోబర్ 29, 31, నవంబర్ 2) ప్రారంభం కానుంది.


