ఓటమికి పార్టీదే సమష్టి బాధ్యత | We will put pressure on Sarkar for implementing election guarantees | Sakshi
Sakshi News home page

ఓటమికి పార్టీదే సమష్టి బాధ్యత

Dec 16 2018 3:32 AM | Updated on Mar 18 2019 9:02 PM

We will put pressure on Sarkar for implementing election guarantees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ దే సమష్టి బాధ్యతని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఈ పరాజయంతో కుంగిపోయే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత పరిణామాలతో కార్యకర్తలు కూడా దిగాలు పడొద్దని, లోపాలు సరిదిద్దుకుని రెట్టించిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో నేతలు ఎన్‌.రామచంద్రరావు, ఎస్‌.కుమార్, బి.వెంకటరెడ్డి, ఎన్‌వీ సుభాష్, డా.ప్రకాష్‌రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం బీజేపీ అన్నిరకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు. గతంలో మాదిరిగా కేసీఆర్‌ నియంతృత్వధోరణి, ఒంటెద్దు పోకడలకు పోతే బీజేపీతో పాటు ప్రజలు కూడా వదిలిపెట్టరని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా కాంగ్రెస్‌తో కలసి ప్రచారం హోరెత్తించడంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో ప్రజలు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపారన్నారు. ప్రజల్లో ఉద్వేగాలు సృష్టించి ప్రజాతీర్పును తమకు అనుకూలంగా కేసీఆర్‌ తిప్పుకున్నారని అభిప్రాయపడ్డారు. 

కేటీఆర్‌వి పగటి కలలు 
కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయడం ద్వారా కుమార పట్టాభిషేకానికి రంగం సిద్ధమైందన్నారు. త్వరలోనే తనయుడిని కేసీఆర్‌ అధికారపీఠం మీద కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150సీట్లు కూడా రావని చెబుతూ కేటీఆర్‌ పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో గెలిచినంత మాత్రాన జాతీయస్థాయిలో ఏదోచేస్తామని కేటీఆర్‌ అనుకుంటే అది ఒట్టి భ్రమ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఓట్లు గల్లంతైనా, డబ్బు, మద్యం ఏరులై పారినా ఎన్నికల అక్రమాలు అరికట్టడంలో ఈసీ విఫలమైందని చెప్పారు.ఈవీఎంల పైనా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీసులే డబ్బులు పంపిణీ చేసిన ఉదంతాలున్నాయని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈనెల 24న హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలపై లోతుగా సమీక్షించి, ఈ సీట్లలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తామన్నారు. దీంట్లో భాగంగా వచ్చేనెలలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు చెప్పారు.

రాహుల్‌ బేషరతుక్షమాపణలు చెప్పాలి... 
రఫేల్‌ యుద్ధవిమానాలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మళ్లీ మళ్లీ పాత ఆరోపణలే చేయడాన్ని లక్ష్మణ్‌ తప్పుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతలకు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సవాల్‌ చేశారు.దేశరక్షణ, సైనికుల మనోభావాలతో ముడిపడిన అంశాన్ని రాజకీయం చేసి బీజేపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నందుకు దేశప్రజలకు రాహుల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement