నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్‌ భార్య | Sakshi
Sakshi News home page

నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్‌ భార్య

Published Wed, Feb 22 2017 4:18 PM

నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్‌ భార్య - Sakshi

హైదరాబాద్‌: తన భర్త, జేఏసీ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన భార్య సుశీల ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ తెలపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా సంఘ విద్రోహ శక్తులేనా’ అని ఆమె నిలదీశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో కోదండరామ్‌ను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా సుశీల మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డిని కలిసి వివరాలు అడిగారు.

ఉదయం 6గంటలకు బయటకు వస్తానని చెప్పినా తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు, దోపిడీ దారులు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు ప్రవర్తించారని దిగులుచెందారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్‌ ఇచ్చి తీరాల్సిందేనని కోదండరామ్‌ భార్య సుశీల డిమాండ్‌ చేశారు.

జేఏసీ తరుపున కోర్టులో వాదనలు చేసిన అడ్వకేట్‌ రచనా రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయం ఆరుగంటలకు బయటకు వస్తానని, కావాలంటే అప్పుడు అరెస్టు చేసుకోండని కోదండరామ్‌ చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తెల్లవారు జామున తలుపులు పగులగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? మూడుగంటల నుంచి ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. ఆయనను వెంటనే విడుదల చేయాలి. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు. మరోపక్క, సీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన అనంతరం సుశీల గవర్నర్‌ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు.

సంబంధిత వార్తలకై చదవండి..

కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్

కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం

(రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్‌ )

Advertisement
Advertisement