తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం పూర్తయిన తరువాత నిర్వహణ వ్యయం భారీగా ఉండబోతోంది.
* సందిగ్ధంలో తెలంగాణ ప్రభుత్వం
* కార్పొరేషన్ అయితే 12.5% సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి
* బోర్డు ఏర్పాటు చేస్తే నిధుల సమీకరణకు ఇబ్బంది
* దీని అధ్యయన బాధ్యతలు ఇక్రా సంస్థకు అప్పగింత
* పథక నిర్వహణ వ్యయం ఏటా 1,200 కోట్లు!
* కోటికిపైగా కుటుంబాలకు తాగునీటి మహాయజ్ఞం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం పూర్తయిన తరువాత నిర్వహణ వ్యయం భారీగా ఉండబోతోంది. ప్రతి సంవత్సరం రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పుడే దృష్టి పెట్టింది. అదేవిధంగా గ్రిడ్ నిర్వహణకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలా... లేక బోర్డునా.. అనేది ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేయడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.
కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తే.. సర్వీసు చార్జీ కింద 12.5 శాతం అనవసరంగా పన్నులు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ మాదిరిగా బోర్డు ఏర్పాటు చేయడం మంచిదనే అభిప్రాయం వస్తోంది. అలా చేస్తే గ్రిడ్‌కు అవసరమైన నిధుల సమీకరణ కష్టమవుతుందన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ‘ఇక్రా’ అనే సంస్థకు ఈ అధ్యయన బాధ్యత అప్పగించినట్లు సమాచారం. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. 26 వాటర్ గ్రిడ్‌ల నుంచి అన్ని గ్రామాలకు పైపులైన్‌తో మంచినీటి సరఫరా చేయడానికిగాను తొలిదశలో ఆరు గ్రిడ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే కార్యక్రమాలు సాగుతున్నాయి.
కాగా, వాటర్‌గ్రిడ్ పథకం కోసం కనీసం 300 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఒక వ్యక్తికి 30 నుంచి 40 లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. 40 శాతం గృహాలకే పైపులైనుతో నీటి సరఫరా జరుగుతోంది. వాటర్ గ్రిడ్ పూర్తిచేసి అన్ని గ్రామాలకు వందశాతం మేరకు పైపులైనుతో నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రస్తుతం గ్రామాల్లో మంచినీటి సరఫరా, చేతి పంపుల మరమ్మతులు తదితరాల కోసం 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.300 కోట్లు గ్రాంట్ల రూపంలో జడ్పీలు, మండలాలు, గ్రామ పంచాయతీలకు అందుతోంది. వాటర్ గ్రిడ్ పథకం పూర్తయ్యాక ఈ నిర్వహణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా... లేదా.. అన్నది ప్రశ్నార్థకమే. నిర్వహణ వ్యయం భారీగా పెరగడం వల్ల ఆ మేరకు ప్రజల నుంచి చార్జీల రూపంలో భారీ వసూళ్లు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం నెలనెలా గ్రామాల్లో 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మూడింతలయ్యే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.