ఓటు భద్రం

Voter Verification Extension Until The End Of This Month - Sakshi

‘ఓటరు ధ్రువీకరణ’ ఈ నెలాఖరు వరకు పొడిగింపు..

ఈసీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పిస్తే సరి

మీ అనుమతి లేకుండా జాబితాలో పేరు తొలగించే వీలుండదు..

ఓటర్లకు శాశ్వత లాగిన్‌ సదుపాయం.. క్రమం తప్పకుండా ఎస్‌ఎంఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓట్ల గల్లంతు వ్యవహారం దుమారం రేపుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ.. ఇలా ఏ తరహా ఎన్నికలు జరిగినా తమ ఓట్లను అకారణంగా తొలగించారని వేల మంది ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం’నిర్వహించి వివిధ కారణాలతో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగిస్తోంది. నివాసం మారారని/ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, చనిపోయారని, డూప్లికేట్‌ ఓటు, బోగస్‌ ఓటు అని నిర్ధారించిన తర్వాతే సంబంధిత వ్యక్తుల ఓట్లను తొలగించాల్సి ఉండగా, చాలా సందర్భాల్లో సరైన విచారణ జరపకుండానే అర్హులైన వ్యక్తుల ఓట్లను తొలగిస్తున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబర్‌ 1 ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని తాజాగా నవంబర్‌ 30 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమంలో ఓటర్ల ధ్రువీకరణతో పాటే ఓటరు పేరు, చిరునామాలో తప్పులను సరిచేసుకోవడం, ఫొటోలను మార్చుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటును ధ్రువీకరించుకున్న వ్యక్తుల పేర్లను వారి అనుమతి లేకుండా ఓటర్ల జాబితాల నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీనిచ్చింది. ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్లకు నిరంతర అప్‌డేట్స్‌ పంపడానికి వారి ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తోంది.

ఇంటింటికీ బీఎల్‌ఓలు... 
ఈ కార్యక్రమంలో భాగంగా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికి తిరిగి ఓటర్లందరి నుంచి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. పాస్‌పోర్టు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఆధార్‌/రేషన్‌కార్డు/ప్రభుత్వ గుర్తింపు కార్డు/బ్యాంకు పాసుపుస్తకం/రైతు గుర్తింపు కార్డు/పాన్‌కార్డు/ జాతీయ జనాభా రిజిస్ట్రర్‌(ఎన్‌పీఆర్‌)లో భాగంగా రా>జీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసే స్మార్టు కార్డు/తాజా నల్లా/టెలిఫోన్‌/విద్యుత్‌/గ్యాస్‌ కనెక్షన్‌ బిల్లుల్లో ఏదైనా ఒకదానికి సంబంధించిన జిరాక్స్‌ ప్రతిని బీఎల్‌ఓలకు అందజేసి తమ ఓటు హక్కును పటిష్టం చేసుకోవచ్చు. ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ఆండ్రాయిడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా కూడా ఓటరు ధ్రువీకరణ చేసుకోచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ కార్యక్రమంతో ప్రయోజనాలు.. 
1) ఓటర్లకు శాశ్వత లాగిన్‌ సదుపాయం 
2) క్రమం తప్పకుండా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అలర్ట్‌ 
3)బీఎల్‌ఓ/ఈఆర్‌ఓలతో పరిచయం 
4) మీ అనుమతి లేకుండా పేరు తొలగించే వీలుండదు 
5) ఎన్నికల సంబంధింత సకల సమాచారాన్ని మీ మొబైల్‌/మెయిల్‌కు అందుతుంది

ఓటర్లు నేరుగా స్వీయ ధ్రువీకరణ చేసుకోవచ్చు.. 
ఓటర్లు స్వయంగా తమ ఓటును ధ్రువీకరించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ (https://www.nvsp.in)లో తమ పేరుతో లాగిన్‌ అకౌంట్‌ను ప్రారంభించి తమ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను అందజేయడంతో పాటు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు.

కొత్త ఫొటోను అప్‌లోడ్‌ చేయవచ్చు. అదేలా అంటే.. 
స్టెప్‌1: మీ ఎపిక్‌ నంబర్‌తో https://www.nvsp.in వెబ్‌సైట్‌కు లాగిన్‌కండి. 
స్టెప్‌ 2: మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం రకం/పేరు, చిరునామా, ఫొటోలను ధ్రువీకరించండి.  
స్టెప్‌ 3: మీ వివరాల్లో తప్పులను సరిచేయడం/వివరాల్లో మార్పులు చేయడం, ఫొటోగ్రాఫ్‌ మార్పు అవసరమైతే చేయండి.
స్టెప్‌ 4: ఏదైనా మీ గుర్తింపు ధ్రువీకరణను అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 5: తదుపరి సేవల కోసం మీ మొబైల్‌ నంబర్‌/మెయిల్‌ ఐడీలను జతచేయండి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top