ఎన్నాళ్లీ కంకర కష్టాలు

Villages Roads Is Not Good in Nizamabad - Sakshi

మరమ్మతుకు నోచుకోని రోడ్డు

ఏడాది క్రితం పనులు ప్రారంభించి వదిలేసిన కాంట్రాక్టర్‌

స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు

లింగంపేట : ‘దేవుడు వరమిచ్చినా–పూజారి కనికరించడం లేదు’ అన్నట్లుగా మారింది భవానిపేట–కంచుమల్‌ రోడ్డు దుస్థితి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, తండాల రోడ్లకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గుత్తేదారుల అలసత్వం ప్రజలకు శాపంగా మారుతోంది. బంగారు తెలంగాణలో భాగంగా గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా లింగంపేట మండలంలోని భవానిపేట నుంచి కంచుమల్‌ మీదుగా గాంధారి మండలం గండివేట్‌ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి రూ.2.20 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా మరమత్తులకు నోచుకోని రోడ్డు బీటీ రోడ్డుగా మారుస్తున్నారని పలు గ్రామాలు, తండాల ప్రజలు  సంతోషం వ్యక్తం చేశారు. కానీ గుత్తేదారు నిర్లక్ష్యంతో ఏడాది దాటినా పనులు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్‌ రోడ్డును తవ్వించి దానిపై కంకర వేసి మరిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. 
అభివృద్ధికి నోచుకోని గ్రామాలు 
లింగంపేట మండల పరిదిలోని భవానిపేట నుంచి గండివేట్‌ వరకు బీటీ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి. భవానిపేట, జల్దిపల్లి, రాంపూర్, మంబోజిపేట, కంచుమల్, కొండాపూర్, గాంధారి మండలం సీతాయిపల్లి, గండివేట్‌తో పాటు పలు తండాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంట సుమారు 12 కీలోమీటర్లు ప్రతి రోజు లింగంపేట మండల కేంద్రానికి, ఎల్లారెడ్డికి వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు పనులను ప్రారంభించారు. సంవత్సరం గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన కంకర అక్కడే ఉండడంతో ప్రతి రోజు వాహనాలు అదుపు తప్పి పడిపోయి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. 
ప్రయాణికులకు ఇబ్బందులు 
రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో పలు గ్రామాలు, తండాలకు చెందిన గర్భిణులు ప్రతి నెల చెకప్‌ కోసం అసుపత్రులకు వెళ్లాలంటే, రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తిరిగే ద్విచక్ర వాహనాలు, ఆటోలు వారం రోజులకే చెడిపోతున్నాయని వాహన దారులు వాపోతున్నారు. రోడ్డు పనులు బాగు చేయాలని అధికారులను, నాయకులను పలుమార్లు కోరినా విసిగించుకుంటున్నారే తప్పా పనులు ప్రారంభించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top