చంద్రయ్య విషాదాంతం

Vijaya Reddy Attender Chandrayya Died - Sakshi

ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన చంద్రయ్య

చికిత్స పొందుతూ మృత్యువాత.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

పెద్దఅంబర్‌పేట, శంషాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్‌ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నవంబర్‌ 4న విజయారెడ్డిపై కార్యాలయంలోనే రైతు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డిని కాపాడబోయిన కారు డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్య గాయపడ్డారు. అయితే, గురునాథం 5న చికిత్స పొందుతూ మృతి చెందగా, హత్యకు కారణమైన కూర సురేశ్‌ 8న మృతిచెందాడు. ఇక చంద్రయ్య డీఆర్‌డీఎల్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ సోమవారం ప్రాణాలొదిలాడు.

మృతులందరికీ చిన్నపిల్లలే.. 
ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికీ చిన్న పిల్లలే ఉన్నారు.  విజయారెడ్డికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడు సురేశ్‌కు కూతురు, కుమారుడు, డ్రైవర్‌ గురునాథంకు ఏడాదిన్నర వయసు కుమారుడు, అటెండర్‌ చంద్రయ్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు.

రాళ్లగూడలో అంత్యక్రియలు 
చంద్రయ్య అంత్యక్రియలు సోమవారం శంషాబాద్‌ పట్టణంలోని రాళ్లగూడలో జరిగాయి. శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన చంద్రయ్య జిల్లాల విభజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ కార్యాలయంలో అటెండర్‌గా నియమితులయ్యా రు. ఆయన తన భార్య పద్మమ్మ, పిల్లలు అభినవ్, కీర్తనలతో కలసి ఉంటున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం వైద్యం చేయించినా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేదని కుటుంబ సభ్యులన్నారు.

ట్రెసా చేయూత 
సాక్షి, హైదరాబాద్‌: చంద్రయ్య కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) బాసటగా నిలిచింది. అత్యవసర ఖర్చులకుగాను చంద్రయ్య కుటుంబ సభ్యులకు ట్రెసా సంఘం నాయకులు రూ. లక్ష అందజేశారు.
డ్యూటీకి వెళ్లిన రోజు నుంచి మళ్లీ ఇప్పుడే.. 
డ్యూటీకి వెళ్లిన రోజు మా నాన్నను చూశాం.. ఆ తర్వాత మేము ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ఈ రోజు చనిపోయాడని చెప్పారు. మా నాన్న బతికుండగా చూసి చనిపోయిన తర్వాత మళ్లీ ఈరోజే చూడాల్సి వచ్చింది. మా నాన్ననే ఇంటికి ఆధారం.. మేము ఇప్పుడు పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని ఎవరు చదివిస్తారు.. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– చంద్రయ్య కుమారుడు అభినవ్, కుమార్తె కీర్తన

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top