అగ్గి తెలంగాణ

Very Hot Summer In Telangana - Sakshi

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

రోహిణి కార్తె ముగింపులోనూ అదే తీవ్రత

వాయవ్య, ఉత్తర దిశ నుంచి పొడి గాలుల వల్లే...

బయట వడగాడ్పులు.. ఇంట్లో తగ్గని వేడి

అల్లాడుతున్న ప్రజలు.. పెరుగుతున్న వడదెబ్బ మృతులు

ఇప్పటివరకు 36 వడగాడ్పు రోజులు నమోదు

మరో 10 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అగ్నిగుండంగా మండుతోంది! ముగింపు దశలో ఉన్న రోహిణి కార్తె రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయటకు వేస్తే వడగాడ్పులు ఠారెత్తిస్తుండగా ఇంట్లోని ఫ్యాన్‌ గాలి సైతం ఎండల తీవ్రతకు సుర్రుమంటోంది. సాయంత్రం ఆరు గంటలు దాటినా ఎండ వేడి ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో వడదెబ్బకు తెలంగాణలో ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి మే 27 వరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 36 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. 205 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు నమోదయ్యాయి. దీంతో జనం అల్లాడి పోతున్నారు. 

పొడిగాలులు, సుదీర్ఘ వడగాడ్పుల వల్లే.. 
వాయవ్య, ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు తెలంగాణపైకి వీస్తుండటం, సుదీర్ఘమైన వడగాడ్పుల రోజులు నమోదు కావడంతో తెలంగాణలో పరిస్థితి దయనీయంగా మారింది. రాజస్తాన్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, భూమండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో తెలంగాణ కూడా ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానంగా జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.

గత సోమవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 47 డిగ్రీల సెల్సియస్‌ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 25న అత్యధిక ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలుండగా మరుసటి రోజుకు మరింత పెరిగింది. గత ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 47.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 121 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచలంలో 1952 జనవరి 29న 48.6 డిగ్రీలు నమోదు కాగా, రెండో అత్యధిక ఉష్ణోగ్రత హన్మకొండలో 1898లో 47.8 డిగ్రీలు నమోదైంది. తాజాగా నీల్వాయిలో నమోదైంది.

మే 26న థార్‌ ఎడారిలో 43.3 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీలు నమోదైంది. గత ఆదివారం వరంగల్‌ అర్బన్‌లో 46.9 డిగ్రీలు, సిరిసిల్లలో 46.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 46.4 డిగ్రీలు, మంచిర్యాలలో 46.1 డిగ్రీలు, భద్రాద్రి, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 46 డిగ్రీల చొప్పున, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు, వరంగల్‌ రూరల్‌లో 45.1 డిగ్రీలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 45 డిగ్రీల చొప్పున, వికారాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

డేంజర్‌ జోన్‌లో తెలంగాణ... 
దేశంలోనే అధికంగా వడగాడ్పులు వీచే డేంజర్‌ జోన్‌లో తెలంగాణ ఉంది. దీనివల్ల రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో కొన్నిచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డేంజర్‌ జోన్‌లో తెలంగాణ ఉండటంతో రుతుపవనాలు వచ్చే వరకు కూడా వడగాడ్పులు నమోదయ్యే అవకాశాలున్నాయి. 2016 వేసవిలో 27 రోజులు వడగాడ్పులు నమోదవగా ఈసారి ఇప్పటికే 36 రోజులు నమోదు కావడం గమనార్హం.

అయితే ఎంత ఎండ ఉన్నా రోజువారీ పనులు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు నిత్యం బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంది పేద, మధ్యతరగతి ప్రజలు ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఉపాధి కూలీలు ఎండలోనే పనిచేయాలి. ఎండలు దంచికొడుతున్నా పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వడదెబ్బ బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 

10న రాష్ట్రానికి రుతుపవనాలు..
ఈ నెల పదో తేదీ నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి శుక్రవారం వెల్లడించారు. కేరళలోకి ఈ నెల 6న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. లానినో ప్రభావం రోజురోజుకు తగ్గుతుందని, దీనివల్ల వచ్చే సీజన్‌లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top