ఇరవై రోజుల్లో ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు..

Vemula Prashanth Reddy Visits SRSP Canal - Sakshi

చెరువులు నింపేలా తూములు ఏర్పాటు చేయాలి

మూడో పంప్‌హౌస్‌ గేట్లను  ఈ నెల15లోగా బిగించాలి

నీటిపారుదలశాఖ సమీక్షలో మంత్రి వేముల ఆదేశం

సాక్షి, నిజామాబాద్‌: మరో ఇరవై రోజుల్లో కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్‌ జలాశయంలో పడబోతున్నాయని రాష్ట్ర రవాణా, రోడ్లుభవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోభాగంగా ఇప్పటికే జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట్‌ పంప్‌హౌజ్‌ల ట్రయల్‌ రన్‌ నిర్వహించామని అన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సమీపంలో ముప్కాల్‌ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్‌ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. పైప్‌లైన్లు, గేట్లు తదితర పనుల ప్రగతిపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్‌ మాసంలో 30 టీఎంసీల కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మొదటగా మిడ్‌మానేరు, ఎస్సారెస్పీకి వస్తున్నాయని, ముప్కాల్‌ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్‌ పనులు పూర్తి కాకపోయినప్పటికీ., మొదటి, రెండు పంపుల ద్వారా రోజుకు 0.6 టీఎంసీల చొప్పున నీటిని తరలించేందుకు వీలు కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రెండు పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలిస్తుండగా, నిర్మాణంలో ఉన్న మూడో పంప్‌హౌజ్‌లోకి నీళ్లు వెళ్లకుండా గేట్ల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ కళకళలాడితే కన్నుల పండువగా ఉంటుందని, చూసి తరించి పోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 200 కిలోమీటర్ల కింది కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి నదిని మళ్లిస్తూ రూ.1,060 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మహా అద్భుతమైనదని వ్యాఖ్యానించారు.

నిజామాబాద్, కరీంగనర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్‌ చరిత్రలో ఈ రివర్స్‌ పంపింగ్‌ పథకం ఓ వండర్‌లా నిలిచిపోతుందని అన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఏడాదంతా నిండుకుండలా ఉండే అవకాశం ఉన్నందున కాలువకు ఇరువైపులా సమీపంలోని చెరువులను నింపేందుకు వీలుగా తూముల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ పనులు త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో ఏయే చెరువులను నింపవచ్చో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి  క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు.

ఇప్పటికే 15 తూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మరిన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద రూ.420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్‌ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. తదనంతరం పనులు జరుగుతున్న స్థలంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో అక్టోబర్‌ మాసంలో మోటార్ల పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top