బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వీధి కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్షణ (10)పై నెల కిందట వీధి కుక్క దాడి చేసింది. దీంతో కుక్క గోళ్లు గీరి తలలో చిన్న గాయం అయింది. భయంతో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
అయితే మూడు రోజుల కిందట చిన్నారి కుక్కలాంటి అరుపులతో వింతగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలికకు తీవ్రమైన రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాలికను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక మృతి చెందింది.


