ప్రణయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు! | Unknown Person Entered Into Honor Killing Victim House In Miryalaguda | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు!

Nov 6 2018 1:29 PM | Updated on Nov 6 2018 4:56 PM

Unknown Person Entered Into Honor Killing Victim House In Miryalaguda - Sakshi

పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఇంటి ఆవరణలోకి ఓ ఆగంతకుడు గోడ దూకి ప్రవేశించాడు.

సాక్షి, మిర్యాలగూడ ‌: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఇంటి ఆవరణలోకి ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు గోడ దూకి ప్రవేశించాడు. సీసీ కెమెరా ఫుటేజీలో ఆగంతకుడు గోడ దూకి వచ్చినట్టు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో అతను సుమారు 8 నిమిషాలు అటూ ఇటూ తచ్చాడినట్టు గుర్తించారు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించిన ఆగంతకుడు , ఓ గదికి ఉన్న కిటికీ తలుపును తెరిచి చూశాడని, అనంతరం తిరిగి గోడ దూకి చర్చిరోడ్డు వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో ఉందని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు.  
 

అలికిడి విని లేచిన పోలీసులు
ఆగంతకుడు వచ్చిన సమయంలో ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు రక్షణగా ఉన్న పోలీసులు పైన గదిలో ఉన్నారు. తిరిగి వెళ్లే సమయంలో గోడ దూకిన అలికిడి విన్న పోలీసులు వెంటనే కిందకు వచ్చి బాలస్వామిని లేపారు. అనుమానం వచ్చిన బాలస్వామి వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడు గోడ దూకి ఇంటి ఆవరణలో తిరిగిన దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని వన్‌టౌన్‌ స్టేషన్‌కు చేరవేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపడతామని ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.  

పోలీసులు లేకుంటే?
ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడి నడుముకు నల్లని బెల్ట్‌ మాదిరిగా ఉందని, ఆ బెల్ట్‌కు ఏముందో అని.. ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఎస్పీ ముందు జాగ్రత్తగా ఇద్దరు సాయుధ పోలీసులతో ప్రణయ్‌ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత ఉందని తెలిసినా ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడంటే పక్కా ప్రణాళికతోనే వచ్చాడా..? అనే అనుమానం కలుగుతోందని ప్రణయ్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడిని గుర్తిస్తే కాని అనుమానాలు నివృత్తి కావని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement