కరువు ఛాయలు | Underground Water Level Disreed Telangana | Sakshi
Sakshi News home page

కరువు ఛాయలు

May 9 2019 12:08 PM | Updated on May 9 2019 12:08 PM

Underground Water Level Disreed Telangana - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జలం పాతాళానికి పడిపోతోంది. జిల్లా అంతటా భూగర్భ జలాలు రోజురోజుకు  పడిపోతుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దశాబ్ద కాలంగా పరిశీలిస్తే.. ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఇది కరువుకు సంకేతమని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 4 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఫరూఖ్‌నగర్‌ మండలంలో అదనంగా 13.08 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. గతేడాది ఏప్రిల్‌ ఈ మండలంలో 28.70 మీటర్ల లోతులో నీటి జాడ ఉండగా.. ప్రస్తుతం ఇది 41.78 మీటర్ల కిందకు చేరింది. ఆ తర్వాత స్థానంలో చేవెళ్ల మండలం ఉంది. ఇక్కడ ఏడాది కాలంలో అదనంగా 8.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. 

ఆందోళనకరంగా.. 
ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 666 మిల్లీ మీటర్లు కాగా.. ఇప్పటివరకు 475 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 28.7 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే గతేడాది కనీసం సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు.  రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా వాసులు ఆధారపడ్డారు. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం మండలంలో మాత్రమే సాధారణ స్థాయిలో వానలు కురిశాయి. మిగిలిన 26 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో కరువు ఛాయలు అలుముకున్నాయి.

డేంజర్‌ జోన్‌లోకి.. 
భూగర్భ జలాలు విచ్చలవిడిగా వాడే గ్రామాలు నాలుగైదేళ్ల కిందట వందలాదిగా ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరగనుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల శాఖ ప్రతి మూడేళ్లకోసారి వంద శాతం కన్నా మించి భూగర్భ జలాలను వినియోగించే (ఓవర్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ విలేజెస్‌) గ్రామాల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుంది. దీని ఆధారంగా ఆయా గ్రామాల్లో భూగర్భ జలం పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం వివిధ శాఖలకు దిశానిర్దేశం చేస్తుంది. చివరిసారిగా తయారు చేసిన 2012–13 సంవత్సరం జాబితా ప్రకారం.. జిల్లాలో 171 గ్రామాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో అవసరానికి మించి నీటి వినియోగం జరిగింది.

2016–17 సంవత్సరం వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీన్ని ప్రకారం భూగర్భ జలాన్ని వినియోగించే గ్రామాల సంఖ్య గతం కంటే పెరిగే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఖ్య 200కు చేరవచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మంచాల, కొత్తూరు, అబ్దుల్లాపూర్‌మెట్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, చేవెళ్ల, నందిగామ, హయత్‌నగర్, కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో భూగర్భ జలాల వినియోగం అత్యంత ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో అనేక అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉంది.  

అధికారుల పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు 

  • జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా విస్తుపోయే ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది ఏప్రిల్‌ నెలలో సగటున 14.86 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 18.73 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 3.87 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  
  • పరిశీలించిన 40 బావుల్లో.. నాలుగింటిలో మాత్రమే నీటిమట్టం పెరిగింది. బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లో గరిష్టంగా 3.28 మీటర్లపైకి నీటిమట్టం చేరుకుంది. మిగిలిన 36 బావుల్లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. గరిష్టంగా మొయినాబాద్‌లో 14.59 లోతుకు దిగజారింది.  
  • 8 మండలాల్లో 20మీటర్ల లోతుకుపైగా, మరో 8 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 8 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 

చేతులెత్తేసిన ఆయా విభాగాలు

పలు శాఖల మధ్య కొరవడిన సమన్వయం వల్ల భూగర్భ జల మట్టం పెరగడం లేదు. అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ప్రభుత్వ విభాగాలు చేతులెత్తేశాయి. ఆయా ఊళ్లలో బోరు బావుల తవ్వకాలను కట్టడిచేయడం, తక్కువ నీరుతో పండే పంటలను ప్రోత్సహించడం, వాల్టా చట్టం పక్కాగా అమలయ్యేలా చూడడం లాంటి చర్యలు తీసుకోవాలి. భూగర్భ జల శాఖ సూచనలతో అటు వ్యవ సాయ శాఖ, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తే కరవును అరికట్టే వీలుంది. సేద్యపు కుంటలు తవ్వుకోవడంలో చాలా మంది రైతులు అలసత్వం వహిస్తున్నారు. నీటి సంరక్షణ చేపట్టే రైతులకే వ్యవసాయ శాఖ వివిధ రాయితీలు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి కొంత వరకు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రజల్లో భూగర్భ జల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement