యూకే నుంచి హైదరాబాద్‌కి 328 మంది | UK To Hyderabad Vande Bharat Flight Reached Hyderabad Airport | Sakshi
Sakshi News home page

వందే భారత్ మిషన్‌లో భాగంగా తరలింపు

May 12 2020 1:04 PM | Updated on May 12 2020 6:46 PM

UK To Hyderabad Vande Bharat Flight Reached Hyderabad Airport - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన చిక్కుకున్నవిపత్కర సమయంలో ‘వందే భారత్’ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా నేడు(మంగళవారం) తెల్లవారుజామున యూకే నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. యూకేలో చిక్కుకుపోయిన 328 మంది భారతీయులతో తెల్లవారు జామున 2.21 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇదే విమానం తిరిగి తెలంగాణలో చిక్కుకుపోయిన 87 మంది అమెరికా జాతీయులను తీసుకుని ఉదయం 5.31 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. అమెరికా జాతీయులను తిరిగి ఢిల్లీ నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు పంపుతారు. (మలేషియాలో మనోళ్ల ఆకలి కేకలు)

యూకే నుంచి వచ్చిన భారతీయులు, అమెరికా వెళ్లే ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేశారు. దీంతో పాటు విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైనవాటిని కూడా శానిజైట్ చేశారు. ఎయిరో బ్రిడ్జి నుంచి బయటికి వచ్చేంత వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించారు. ఇక విమానాశ్రయంలోకి ప్రయాణికులను 20-25 మందితో ఒక బృందంగా చేసి తీసుకువచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు పూర్తి చేయడానికి ముందు ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాకల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. (కరోనా ఫ్రీగా కరీంనగర్‌)

స్క్రీనింగ్ అనంతరం, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వారిని ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తీసుకువెళ్లారు. ప్రయాణికులు, ఇమిగ్రేషన్ సిబ్బంది మధ్య ఎడబాటు ఉండేందుకు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద సామాజిక దూరం నిబంధనలు పాటించారు. ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులు సామాజిక దూరం నిబంధనలు పాటించడంలో సహకరించారు. బ్యాగేజ్ బెల్టుతో అనుసంధానించిన డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా ప్రయాణికుల బ్యాగేజీని శానిటైజ్ చేశారు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తైన అనంతరం టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్లడానికి పంపిస్తూ ప్రయాణికులకు కాంప్లిమెంటరీ ఆహార పొట్లాలను అందించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులు తరలివెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను మరొకసారి పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేట్, డిస్‌ఇన్ఫెక్ట్ చేశారు.

తరలింపు విమానాలు
ఇప్పటివరకు నాలుగు వందే భారత్ తరలింపు విమానాలు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి వెళ్లాయి. వీటి ద్వారా కువైట్, యూఏఈ, అమెరికా, యూకేలో చిక్కుకుపోయిన సుమారు 750 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన భారతీయులందరినీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్వారంటైన్ చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 12 ఎవాక్యుయేషన్ ఫ్లయిట్స్ ద్వారా అమెరికా, యూకే, జర్మనీ, కెన్యా, జర్మనీ జాతీయులను వారి స్వదేశాలకు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement