కరోనా ఫ్రీగా కరీంనగర్‌

All Corona Cases Negative Report in Karimnagar Zero Cases Now - Sakshi

అన్ని పాజిటివ్‌ కేసులు నెగెటివ్‌

అధికారులు, ప్రజాప్రతినిధుల శ్రమ ఫలితం

దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిన వైనం..

కరీంనగర్‌టౌన్‌: కరోనా రహిత జిల్లాగా కరీంనగర్‌ అవతరించింది. ఇండోనేషియన్లు మత ప్రచారం కోసం కరీంనగర్‌కు రాగా, వచ్చిన 10 మందిని మార్చి 16న కరోనా అనుమానితులుగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. మూడు రోజుల వ్యవధిలో అందరికీ  పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత మర్కజ్‌ యాత్రకు వెళ్లొచ్చినవారు, వారితో కాంటాక్టు అయిన వారు మొత్తం 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమష్టిగా శ్రమించి కరోనా ఫ్రీగా కరీంనగర్‌గా మార్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా ఇండోనేషియన్లు బసచేసిన, పర్యటించిన ముకరంపుర ప్రాంతాన్ని మార్చి 19నే రెడ్‌జోన్‌గా ప్రకటించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. కరోనా కట్టడిలో రాష్ట్రం మొత్తం కరీంనగర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుంది. కరీంనగర్‌లో ఎక్కడి పాజిటివ్‌ కేసు నమోదైతే ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌గా చేసి ప్రాథమిక కాంటాక్టులు జరగకుండా చర్యలు చేపట్టారు.

దీంతో వైరస్‌ను కట్టడి చేశారు. జనతా కర్ఫ్యూ మొదలు లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు ఉన్నా.. లేకున్నా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలు అమలు చేసి కరోనాను నియంత్రించారు. కరోనా కేసులు తగ్గినా జిల్లా కేంద్రంతోపాటు హుజురాబాద్‌లో వైద్య బృందాలు ఇంటింటా పరీక్షలు నిర్వహించి కరోనా అనుమానితులను గుర్తించడంతో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వాçసుపత్రి ఐసోలేషన్‌లో 140 మంది, శాతవాహన యూనివర్శిటీ క్వారంటైన్‌లో 118, చల్మెడ క్వారంటైన్‌లో 90 మంది అనుమానితులను ఉంచారు. జిల్లాలో మొత్తం 159 వైద్య బృందాలతో సర్వే చేపట్టి 526 రక్తనమూనాలను పరీక్షల కోసం పంపించారు.  1,42,000 మందికి స్క్రీనింగ్‌ చేశారు. వైద్య బృందంలో 50 మంది డాక్టర్లు, 70 మంది సూపర్‌వైజర్లు, 650 మంది ఆశ కార్యకర్తలు, 250 మంది ఏఎన్‌ఎంలు సేవలందించారు. వైద్యులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం, మున్సిపల్‌ శాఖ సమన్వయంతో కరోనాను కట్టడి చేసి కరీంనగర్‌ నుంచి మహమ్మారిని తరిమేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజలు సైతం లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమై ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top