మలేషియాలో మనోళ్ల ఆకలి కేకలు

Telangana Migrant Workers Stuck in Malaysia Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ అమలుతో ఉపాధి కరువు

చట్ట విరుద్ధంగా ఉంటుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి

నిత్యావసరాలు నిండుకోవడంతో ఆకలితో అలమటిస్తున్నాం

విజిట్‌ వీసాపై వెళ్లిన తెలంగాణ కార్మికుల ఆవేదన

మోర్తాడ్‌(బాల్కొండ): పర్యాటకులకు స్వర్గధామమైన మలేషియాలో తెలంగాణ వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడి కోసం మలేషియాలో రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడటంతో వలస కార్మికులకు ఉపాధి కరువైంది. మలేషియాకు విజిట్‌ వీసాలపై వెళ్లి ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకోవచ్చని ఏజెంట్లు నమ్మించడంతో ఎంతో మంది తెలంగాణ కార్మికులు అక్కడకు వలస వెళ్లారు. గల్ఫ్‌ దేశాల కంటే కొంత మెరుగైన వేతనం అందుతుండటంతో తెలంగాణ జిల్లాల నుంచి వలస కార్మికులు మలేషియాకు క్యూ కట్టారు. మలేషియాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతుండటంతో పోలీసులు అడుగడుగునా గస్తీ నిర్వహిస్తున్నారు. దీంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు తమ నివాస స్థలాల నుంచి బయటకు రాలేక పోతున్నారు.

మొదట్లో తమ వద్ద నిలువ ఉన్న వంట సామగ్రితో వారం, పది రోజుల పాటు వెళ్లదీసామాని కార్మికులు తెలిపారు. రెండు నెలల నుంచి ఉపాధి లేక పోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని కార్మికులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తరువాత కొందరు దాతలు ఇచ్చిన సరుకులతో కొన్ని రోజులు రెండు పూటలా భోజనం చేశామని కార్మికులు వివరించారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు నిండుకోవడంతో ఒక్క పూట కూడా భోజనం చేయలేని దుస్థితిలో ఉన్నామని నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయికి చెందిన శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన రాజయ్య ‘సాక్షి’కి వివరించారు. మలేషియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు దాదాపు 1,500 మంది ఉన్నారు. మలేషియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కార్మికులు తమ ఆవేదనను విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ ఆకలి బాధను తీర్చడానికి మలేషియా ప్రభుత్వంతో చర్చించాలని వలస కార్మికులు కోరుతున్నారు.

ఇంటికి చేర్చండి
ఏజెంట్ల మాయమాటలు నమ్మి మలేషియాకు వచ్చిన మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత మమ్మల్ని ఎలాగైనా ఇంటికి చేర్చండి. కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల వల్ల వలస కార్మికులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రోజు ఒక పూట భోజనం కూడా దొరకడం లేదు.– రాజయ్య, కార్మికుడు, రామారెడ్డి, కామారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top