హరీశ్‌ ఇల్లు ముట్టడి; అరెస్ట్‌

TSRTC Strike Enters 38th day on Monday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 38వ రోజు సోమవారం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. తమ పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ఈ ఆందోళన చేపట్టారు.

సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరిశ్‌రావు ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికురాలు స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను విన్నవించుకున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అఖిలపక్ష నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్టలో వామపక్షల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్ర​కటించాయి.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు యత్నించగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ గంప గోవర్ధన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ క్యాంప్‌ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టిడించారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. (చదవండి: 18న సడక్‌ బంద్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top