హైదరాబాద్‌లో కోవిడ్‌ గుబులు!

TS Government Take Strong measures to prevent the Covid 19 Virus From Entering - Sakshi

వీకెండ్‌ ఫోకస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: చైనాలోని వూహాన్‌ పట్టణ కేంద్రంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌(కరోనా) వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలోనూ అలజడి సృష్టించింది. చైనా తదితర దేశాల నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు వస్తుండడంతో ఏ క్షణాన ఈ వైరస్‌ ఇక్కడి ప్రజలను కబళిస్తుందోనన్న ఆందోళన ఈ వారమంతా నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఈ వైరస్‌ సోకిందని, పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌ వచ్చిందన్న వార్తలు ఈ ఆందోళనలను మరింత అధికం చేశాయి. చివరకు వారికి కూడా నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని తేలడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది.  

  • కోవిడ్‌ వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంది. ప్రత్యేక పర్యవేక్షణతో ఆ శాఖ ఉన్నతాధికారులు కోవిడ్‌ వైరస్‌పై యుద్ధమే చేశారంటే అతిశయోక్తి కాదు.  
  • గత పది రోజుల నుంచి మొత్తం 92 మందిని పరీక్షించారు. ఇందుకోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.  
  • శంషాబాద్‌ విమానాశ్రయంలోనే థర్మల్‌ స్కానింగ్‌ ద్వారా ప్రయాణికులను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ నగరంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.  
  • వైరస్‌ సోకిందన్న అనుమానం ఉన్న వారిని వైద్యాధికారులు నిశితంగా పరీక్షించారు. వైరస్‌ లేదని తేలిన తర్వాతే వారిని ఆసుపత్రుల నుంచి బయటకు పంపారు.  
  • కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వసంత్‌ అనే వైద్యాధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే, దాంతో తనకు సంబంధం లేదని, తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆ వైద్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆయనకు డాక్టర్ల జేఏసీ మద్దతివ్వడం లాంటి ఘటనలు జరిగాయి.  
  • మొత్తంమీద గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే వైరస్‌ మాట వినిపించింది.  
  • చైనాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏం జరుగుతోందన్న దానిపై ప్రజలు ఆరా తీస్తూ కనిపించారు.  
  • ముఖ్యంగా చైనాలో నెలకొన్న పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.  
  • కోవిడ్‌ వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ... వాడాల్సిన మందులు ఇవేనంటూ ఫేక్‌ వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందాయి. వాటిని నమ్మొద్దంటూ నిపుణులు సూచించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top